నాడు ధోనీ కొట్టిన ఆ బాల్ ఎక్కడుందో తెలిసిపోయిందన్న సునీల్ గవాస్కర్!

24-09-2020 Thu 10:55
2011 World Cup Final Match Ball is now at a fan
  • 2011, ఏప్రిల్ 2న వరల్డ్ కప్ ఫైనల్
  • కులశేఖర బౌలింగ్ లో సిక్స్ కొట్టి గెలిపించిన ధోనీ
  • ఆ బంతిని జ్ఞాపికగా ఓ అభిమాని మలిచాడన్న గవాస్కర్
  • ధోనీ పేరిట ప్రత్యేక సీటును ఏర్పాటు చేయనున్న బీసీసీఐ

2011, ఏప్రిల్ 2... భారత క్రికెట్ అభిమానులు ఆ రోజును ఎన్నడూ మరచిపోలేరు. మహేంద్ర సింగ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు, ఇండియాకు రెండో సారి వరల్డ్ కప్ ను అందించిన రోజది. నాడు మ్యాచ్ తుది క్షణాల్లో కులశేఖర వేసిన బంతిని ధోనీ అద్భుత రీతిలో సిక్స్ గా మలిచి జట్టును విజయతీరాలకు చేర్చిన సంగతి తెలిసిందే. అయితే, ధోనీ కొట్టిన ఆ బంతి ఎంసీఏ పెవీలియన్ స్టాండ్, ఎల్ బ్లాక్ లోని 210వ సీట్ పై పడిందన్న సమాచారం మినహా బీసీసీఐ ఆ బంతిని కనిపెట్టలేకపోయింది. దీని కోసం ఎంతో మంది వెతికారు కూడా. 

తాజాగా, ఆ బంతి ఎవరి వద్ద ఉన్నదో తనకు తెలిసిందని సునీల్ గవాస్కర్ వెల్లడించారు. తన మిత్రుడి వద్ద ఆ బంతి ఉన్నదని, అతను ఆ బంతిని, నాటి మ్యాచ్ టికెట్ ను ఓ జ్ఞాపికగా చేసుకుని దాచుకున్నాడని సునీల్ వెల్లడించారు. ధోనీ కొట్టిన నాటి బంతి ఎక్కడుందో తెలియగానే, ఈ సీటును ఇతర సీట్లకన్నా భిన్నంగా మార్చి, ప్రత్యేకంగా కనిపించేలా చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ధోనీ పేరిట ఆ సీటును ఓ జ్ఞాపకంగా మార్చనున్నామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

కాగా, ఇలా చారిత్రాత్మక ఘటనలు జరిగిన సమయంలో ఆ సీట్లను ప్రత్యేకంగా మార్చడం ఇదే తొలిసారి కాదు. ఆస్ట్రేలియా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్ లో సైమన్ ఓడోనెల్ 122 మీటర్ల దూరానికి బంతి వెళ్లేలా సిక్స్ కొట్టిన వేళ, ఆపై బిగ్ బాష్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో బ్రాడ్ హాడ్జ్, తన చివరి మ్యాచ్ లో 96 మీటర్ల దూరానికి సిక్స్ ను కొట్టిన సమయంలోనూ, ఇదే విధంగా ఆ సీట్లను ప్రత్యేకంగా చేశారు. 2015 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో ఇలియట్ సిక్స్ కొట్టి, తన జట్టును ఫైనల్ కు చేర్చిన తరువాత కూడా బంతి పడిన సీటును మార్చారు.