ట్వీట్ పెట్టి.. ఆ వెంటనే డిలీట్ చేసిన ధోనీ భార్య సాక్షి... అప్పటికే వైరల్!

24-09-2020 Thu 08:53
Sakshi Singh Tweets and Delete on Umpiring Mistakes
  • అంపైరింగ్ తప్పిదాలపై ప్రశ్న
  • నాణ్యత మరింత పెరగాల్సి వుందని ట్వీట్
  • ఆపై డిలీట్ చేసినా స్క్రీన్ షాట్స్ వైరల్

చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షీ ధోని, ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో జరుగుతున్న అంపైరింగ్‌ తప్పిదాలను విమర్శిస్తూ, ఓ ట్వీట్ పెట్టి, ఆపై ఏమనుకుందో ఏమో దాన్ని డిలీట్ చేసేసింది. అప్పటికే ఆ ట్వీట్ వైరల్ అయింది.

రాజస్థాన్, చెన్నైల మధ్య  మంగళవారం జరిగిన మ్యాచ్ ‌లో ఆర్ఆర్ ఆటగాడు టామ్‌ కరన్ ‌ను ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్ ‌గా ప్రకటించిన తరువాత, ఇద్దరు అంపైర్లు సమీక్షించుకొని థర్డ్ అంపైర్‌ కు నివేదించిన సంగతి తెలిసిందే. థర్డ్ అంపైర్ కరన్ ను నాటౌట్ ‌గా ప్రకటించాడు. దీనిపై ఇన్ ‌స్టాగ్రామ్, ట్విట్టర్ ‌లలో స్పందించిన  సాక్షి, సాంకేతికతనే వాడాలనుకుంటే సరిగ్గా వాడాలని అభిప్రాయపడింది.

"ఔట్‌ అంటే ఔటే. అది క్యాచ్‌ అయినా ఎల్బీడబ్ల్యూ అయినా..  ఔటిచ్చాక తిరిగి మూడో అంపైర్‌కు నివేదించడాన్ని తొలిసారి చూస్తున్నా" అని పేర్కొంది. కోట్ల మంది వీక్షించే ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో అంపైరింగ్‌ మరింత నాణ్యంగా ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పోస్ట్ పెట్టిన నిమిషాల వ్యవధిలోనే దానిని ఆమె తొలగించడం గమనార్హం.