టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్.. విజయాన్ని రిపీట్ చేస్తుందా?

23-09-2020 Wed 19:22
kolkata knight riders won the toss and elected bowl first
  • ఐపీఎల్‌లో నేడు ఐదో మ్యాచ్
  • 2013 నుంచి ఆరంభ మ్యాచ్‌లో ఓడిపోయిన కోల్‌కతా
  • తొలి ఓటమి నుంచి బయటపడాలని చూస్తున్న ముంబై

ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ మరోమాటకు తావులేకుండా ముంబైని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. టోర్నీ ఆరంభమ్యాచ్‌లో చెన్నై చేతిలో పరాజయం పాలైన ముంబై.. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ పొరపాట్లకు తావివ్వకూడదని గట్టి పట్టుదలగా ఉంది. జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదని రోహిత్ తెలిపాడు.

ఇది తమకు తొలి మ్యాచ్ కావడంతో అందరూ ఉత్సాహంగా ఉన్నారని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. మోర్గాన్, కమిన్స్, రసెల్స్, నరైన్ వంటి ఆటగాళ్లతో జట్టు సమతూకంతో ఉందని పేర్కొన్నాడు. కాగా, కోల్‌కతా జట్టు 2013 నుంచి ఇప్పటి వరకు ఓపెనింగ్ మ్యాచ్‌లో ఎన్నడూ ఓటమిని చవిచూడలేదు. నేటి మ్యాచ్‌లో ఆ రికార్డును కొనసాగిస్తుందో, లేదో వేచి చూడాల్సిందే.