తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన షారుఖ్ ఖాన్!

23-09-2020 Wed 14:06
Atlee Kumar to direct Sharukh Khan
  • ఇటీవలి కాలంలో హిట్లు లేని షారుఖ్
  • అట్లీకుమార్ తో ప్రాజక్టుకి ఓకే
  • ఇందులో షారుఖ్ ద్విపాత్రాభినయం  
  • సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'పఠాన్'

తమిళ యువ దర్శకుడితో పనిచేయడానికి బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తేరి, మెర్సల్, బిగిల్ వంటి చిత్రాల ద్వారా మంచి కమర్షియల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న అట్లీకుమార్ దర్శకత్వంలో షారుఖ్ ఓ చిత్రం చేయనున్నాడు. గత రెండేళ్లుగా నలుగుతూన్న ఈ ప్రాజక్టు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చింది.

ఈ సినిమాలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఒక పాత్రలోనూ, పోలీసధికారిగా మరో పాత్రలోను షారుఖ్ కనిపిస్తాడని తెలుస్తోంది. మామూలుగా అట్లీ చిత్రాలు యాక్షన్ ఓరియెంటెడ్ గా కమర్షియల్ హంగులతో నిండివుంటాయి. ఇది కూడా అదే రీతిలో ఉంటుందని అంటున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇటీవలి కాలంలో తనకు సరైన హిట్లు లేకపోవడంతో షారుఖ్ గత కొన్నాళ్లుగా బాగా ఆలోచించి ఇప్పుడు కొత్త చిత్రాలను అంగీకరిస్తున్నాడు. ఈ క్రమంలో మూడు చిత్రాలను ఓకే చేశాడు. అట్లీ చిత్రంతో పాటు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందే 'పఠాన్', రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఒక చిత్రం షారుఖ్ అంగీకరించిన వాటిలో వున్నాయి. వీటిలో ముందుగా 'పఠాన్' మొదలవుతుంది.