పార్లమెంటు ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీల నిరసన

23-09-2020 Wed 13:35
TRS protests farm bills in Parliament premises
  • వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్
  • రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని మండిపాటు
  • బిల్లులకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులకు పార్లమెంటు ఉభయసభలు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి సంతకం పెడితే ఈ బిల్లులు చట్టరూపం దాల్చనున్నాయి. అయినప్పటికీ, ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీలు చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ బిల్లుపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విభిన్న వైఖరిని అవలంబిస్తున్నాయి. ఈ బిల్లులకు వైసీపీ పూర్తి మద్దతు ప్రకటించగా... టీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లుల వల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని టీఆర్ఎస్ వాదిస్తోంది.

ఈ క్రమంలో ఈ బిల్లులను వ్వతిరేకిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఈరోజు ప్లకార్డులు చేతపట్టి నిరసన వ్యక్తం చేశారు. రైతాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఇతర విపక్ష సభ్యులతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి కాంగ్రెస్ కీలక నేత అహ్మద్ పటేల్ నిరసన వ్యక్తం చేయడం మనం ఫొటోలో చూడవచ్చు. మరోవైపు, ఈ బిల్లుల వల్ల రైతులకు ఇప్పటి వరకు జరగని మేలు జరగబోతోందని కేంద్ర ప్రభుత్వం చెపుతోంది.