India: యథాతథ స్థితి పునరుద్ధరణ విషయమై ఇండియా, చైనా చర్చలు అసంపూర్ణం!

  • మరోసారి సమావేశం కావాలని నిర్ణయం
  • సైనికులు వెనక్కు వెళ్లేలా వెలువడని నిర్ణయం
  • చర్చల్లో చైనా విదేశాంగ శాఖ  అధికారి
No Desission on Border Issue

సరిహద్దులో ఇటీవలి ఘర్షణలకు ముందు ఉన్నటువంటి యథాతథ స్థితి పునరుద్ధరణ విషయమై ఇండియా, చైనాల మధ్య జరిగిన సైనికాధికారుల స్థాయి చర్చలు మరోసారి అసంపూర్ణంగా మిగిలాయి. చర్చల కోసం మరోసారి సమావేశం కావాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి వెనక్కు వెళ్లే దిశగా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేకపోయారు. ఈ మేరకు ఆరో విడత సీనియర్ కమాండర్ స్థాయి చర్చలపై సంయుక్త మీడియా ప్రకటన విడుదలైంది.

ఇదిలావుండగా, మరోవైపు చైనా సరిహద్దుల్లో తన సైన్యాన్ని మరింతగా పెంచుకుంటూ పోతుండటం గమనార్హం. ఇదే సమయంలో చైనాకు దీటుగా, ఇండియా కూడా సైన్యాన్ని పెంచుతోంది. క్షేత్ర స్థాయిలో సైనికులను తగ్గించడం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించాలనే విషయంలో ఏ విధమైన చర్చలు జరిగాయన్న విషయంపై సమాచారం వెలువడలేదు.   తూర్పు లడఖ్ లోని మోల్డో ప్రాంతంలో లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో జరిగిన ఈ చర్చలలో చైనాకు చెందిన విదేశాంగ శాఖ ఉన్నతాధికారి కూడా ఒకరు పాల్గొన్నారని తెలుస్తోంది.

ఈ నెల 10వ తేదీన రష్యాలో భారత్, చైనా విదేశాంగ మంత్రులు జై శంకర్, వాంగ్ యీ సమావేశం తరువాత, సరిహద్దుల్లో సైనికులను వెనక్కు తీసుకునే దిశగా, సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని రెండు దేశాలూ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రొటోకాల్స్, ముందుగా చేసుకున్న ఒప్పందాల ప్రకారం రెండు దేశాలూ నడచుకోవాలని మాత్రమే ఇద్దరు విదేశాంగ మంత్రులు నిర్ణయించారు. సైనికాధికారుల స్థాయిలోనే మరిన్ని చర్చలు జరపడం ద్వారా, ఉద్రిక్తతలను తగ్గించాలని నిర్ణయించారు.

More Telugu News