ఏపీలో పెరుగుతున్న కరోనా రికవరీలు... తాజాగా 10,555 మందికి కరోనా నుంచి విముక్తి

22-09-2020 Tue 18:17
Corona recovery percentage goes better in AP
  • ఇప్పటివరకు ఏపీలో 6.39 లక్షల కరోనా కేసులు
  • 5.62 లక్షల మందికి కరోనా నయం
  • ప్రస్తుతం 71 వేల మందికి చికిత్స

ఏపీలో గత కొన్నిరోజులుగా కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 10,555 మందికి కరోనా నయం అయింది. ఓవరాల్ గా ఇప్పటివరకు రాష్ట్రంలో 6,39,302 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 5,62,376 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 71,465 మంది చికిత్స పొందుతున్నారు.

ఏపీలో కొత్తగా 7,553 పాజిటివ్ కేసులు రాగా, 51 మంది కరోనాతో మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 8 మంది, అనంతపురం జిల్లాలో ఆరుగురు, విశాఖ జిల్లాలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 5,461కి పెరిగింది.

కొన్నివారాల కిందట భారీగా పాజిటివ్ కేసులు వెల్లడి కావడం, అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవించడంతో ఏపీలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ప్రస్తుతం మునుపటి ఉద్ధృతి కనిపించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.