జగన్ ఎవరి కాళ్లయినా పట్టుకుంటారు... ఈ విషయం మర్చిపోతే ఎలా సజ్జల గారూ!: బుద్ధా వెంకన్న

22-09-2020 Tue 17:04
Budda Venkanna makes satirical comments on YCP top brass
  • టీడీపీ, వైసీపీ నేతల మధ్య వార్
  • బెయిల్ కోసం సోనియా కాళ్లపై పడ్డాడన్న బుద్ధా
  • డబ్బు కోసం కేసీఆర్ కాళ్లపై పడ్డాడని వ్యాఖ్యలు

సోషల్ మీడియాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో సాగుతోంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వైసీపీ అగ్రనేతలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చేసిన అవినీతి నుండి బయటపడడానికి ఎవరి కాళ్లు పట్టుకోవడానికైనా జగన్ సిద్ధమేనని ఎద్దేవా చేశారు. ఈ విషయం మర్చిపోతే ఎలా సజ్జల గారూ! అంటూ బుద్ధా వ్యంగ్యం ప్రదర్శించారు.

"బెయిల్ కోసం సోనియా కాళ్లపై పడ్డాడు. లోపలికి వెళ్లకుండా ఉండడానికి మోదీ కాళ్లపై పడ్డాడు. ఎన్నికల్లో డబ్బు కోసం కేసీఆర్ కాళ్ల మీద పడ్డాడు. ముందు జాగ్రత్తగా రాష్ట్రపతి కాళ్లపై పడ్డాడు" అంటూ ట్వీట్ చేశారు. పత్రికల్లో, చానళ్లలో వచ్చిన కథనాలను కూడా బుద్ధా పోస్టు చేశారు. సీఎం జగన్ తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలోనే బుద్ధా ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.