Revanth Reddy: ట్రాన్స్ జెండర్లకు మద్దతుగా రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

Revanth Reddy signed a petition for transgenders
  • 70 ఏళ్లుగా ట్రాన్స్ జెండర్లను పట్టించుకోవడంలేదన్న రేవంత్
  • వారిని నేరుగా చట్టసభలకు నామినేట్ చేయాలని డిమాండ్
  • చేంజ్ డాట్ ఆర్గ్ లో పిటిషన్
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ట్రాన్స్ జెండర్ల సమస్య ఒక్కటే. తక్కిన సమాజంతో వారు పరిపూర్ణంగా కలవలేరు. నాగరికత కొత్త ఎత్తులకు చేరుతున్న ప్రస్తుత కాలంలోనూ హిజ్రాలు ఇంకా సమాజ సరిహద్దుల్లోనే సంచరిస్తుండడం బాధాకరం. వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని, ముఖ్యంగా చట్టసభల్లో వారికి సముచిత స్థానం కల్పించాలని కొంతకాలంగా డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.

ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ట్రాన్స్ జెండర్లకు మద్దతు పలికారు. వారిని నేరుగా చట్టసభలకు పంపాలంటూ తన మనోగతాన్ని వెల్లడించారు. "కొన్ని లక్షల మంది ఉండే ట్రాన్స్ జెండర్ల సమాజాన్ని మనం గత 70 ఏళ్లుగా విస్మరిస్తూనే ఉన్నాం. నేరుగా నామినేట్ చేయడం ద్వారా వారిని పార్లమెంటులోకి, అసెంబ్లీల్లోకి తీసుకురావడం ఎంతో ముఖ్యమని భావిస్తున్నాను. దీనిపై విస్తృతస్థాయిలో అవగాహన కల్పించేందుకు నేను ఓ పిటిషన్ ప్రారంభిస్తున్నాను. ట్రాన్స్ జెండర్లను చట్టసభలకు నామినేట్ చేయాలన్న అభిప్రాయానికి కట్టుబడి ఉంటాను" అంటూ ట్వీట్ చేశారు.

ఈ మేరకు 'చేంజ్ డాట్ ఆర్గ్' (change.org) లో ప్రచార పిటిషన్ ప్రారంభించారు. 'చేంజ్ డాట్ ఆర్గ్' వెబ్ సైట్ లో ఈ పిటిషన్ కు మద్దతు పలకడం ద్వారా ట్రాన్స్ జెండర్లను చట్టసభలకు నేరుగా నామినేట్ చేయాలన్న డిమాండ్ ను మరింత ముందుకు తీసుకువెళ్లవచ్చు.
Revanth Reddy
Transgenders
Petition
Parliament
Assembly
Nominate

More Telugu News