జగన్ గారూ.. మీ మంత్రి వ్యాఖ్యలను సీబీఐ పరిధిలోకి తెచ్చే ధైర్యం ఉందా?: దేవినేని ఉమ

22-09-2020 Tue 13:37
  • కొడాలి నాని వ్యాఖ్యలపై విమర్శలు
  • మంత్రుల వ్యాఖ్యలే తాజా ఘటనలకు కారణమన్న ఉమ
  • నాని వ్యాఖ్యల వీడియో పంచుకున్న టీడీపీ నేత
Devineni Uma asks CM Jagan that he have any guts to go for CBI enquiry into recent incidents

ఏపీ మంత్రి కొడాలి నాని ఇటీవల చేసిన వ్యాఖ్యలు విపక్షాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఆలయాలపై దాడులు, తిరుమల డిక్లరేషన్ అంశంపై కొడాలి నాని తన అభిప్రాయాలు వెల్లడించగా, బీజేపీ, టీడీపీ మండిపాటుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ట్విట్టర్ లో స్పందిస్తూ, సీఎం జగన్ ను ప్రశ్నించారు.

విగ్రహం చేయి విరిగిపోతే పోయేదేమీ లేదు, రథం కాలిపోతే కొత్తది వస్తుంది... మూడు సింహాల సొమ్ముతో మిద్దెలొస్తాయా? తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు? అంటూ మీ మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలకు మీ మంత్రులు, నాయకుల మాటలు కారణం కాదా? అని నిలదీశారు. మీ మంత్రి వ్యాఖ్యలను, 16 నెలల్లో  జరిగిన ఘటనలను సీబీఐ పరిధిలోకి తెచ్చే ధైర్యం ఉందా చెప్పండి జగన్ గారూ! అంటూ ట్వీట్ చేశారు.

అంతేకాదు, మంత్రి కొడాలి నాని గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ఉమ ఓ వీడియో రూపంలో పంచుకున్నారు.