లైంగిక వేధింపుల ఆరోపణల్లో నా పేరును ప్రస్తావించడంపై న్యాయ పోరాటం చేస్తా: హీరోయిన్ రిచా

22-09-2020 Tue 11:09
richa slams payal
  • అనురాగ్‌ కశ్యప్‌పై పాయల్ ఘోష్ లైంగిక వేధింపుల ఆరోపణలు
  • రిచాతో అనురాగ్‌కు సంబంధం ఉందని వ్యాఖ్య
  • అనవసరంగా తన పేరును లాగుతున్నారని రిచా ఆగ్రహం

సినీ నిర్మాత, దర్శకుడు అనురాగ్‌ కశ్యప్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సినీ నటి పాయల్ ఘోష్ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, సినీనటి రిచా చద్దా తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లకు తనతో లైంగిక సంబంధాలున్నాయని అనురాగ్ గతంలో చెప్పినట్టు పాయల్ తెలిపింది. దీనిపై రిచా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో తన పేరును ప్రస్తావించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపింది.

అనురాగ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ అనవసరంగా తన క్లయింట్‌ రిచా పేరును ప్రస్తావించారని, అవమానకర రీతిలో ఆమె పేరును వాడారని ఆమె లాయర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. అనవసర వివాదంలోకి రిచా పేరును లాగి ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బ‌తీశారని చెప్పారు. ఇతర మహిళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే చర్యలు సరికావని, ఆ హక్కు ఎవరికీ లేదని తెలిపారు. ఈ విషయంపై తాము న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.