రాత్రంతా పార్లమెంట్ లాన్ లో ఎనిమిది మంది ఎంపీల నిరసన... రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ చాయ్ ఇస్తే తిరస్కరణ!

22-09-2020 Tue 08:49
Suspended MPs Continue their Protest in Parliament Lawns
  • వ్యవసాయ బిల్లులపై గందరగోళం
  • సభను వీడకుండా నిరసన తెలిపిన 8 మంది
  • తెల్లవార్లూ పచ్చిక బయళ్లపై కూర్చుని నిరసన
  • పొద్దున్నే వచ్చి పరామర్శించిన హరివంశ్

రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టిన వేళ, పోడియంలోకి దూసుకెళ్లి, నిరసన తెలియజేసి సస్పెన్షన్ కి గురైన 8 మంది ఎంపీలు, రాత్రంతా పార్లమెంట్ ఎదుట ఉన్న పచ్చిక బయళ్లలోనే కూర్చుని తమ నిరసనను కొనసాగించారు. నిన్న రాజ్యసభ ఐదుసార్లు వాయిదా వేసినప్పటికీ, వారు హౌస్ ను వీడేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. తాము రైతుల పట్ల పోరాడుతూ ఉన్నామని, పార్లమెంట్ ను చంపేశారని రాసున్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు.

ఇక ఈ ఉదయం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, రాజ్యసభకు వచ్చిన వేళ ఆసక్తికర ఘటన జరిగింది. నేరుగా నిరసన చేస్తున్న ఎంపీల వద్దకు వెళ్లిన ఆయన, వారిని పరామర్శించి, టీ తాగాలని కోరారు. అయితే, ఎంపీలు మాత్రం హరివంశ్ ఇచ్చిన చాయ్ తాగేందుకు నిరాకరిస్తూ, ఆయన్ను రైతు వ్యతిరేకిగా అభివర్ణించారు. కాగా, నిన్న విపక్ష సభ్యులు హరివంశ్ పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని చైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించిన సంగతి తెలిసిందే.