సీనియర్ సినీ నటి సీత కన్నుమూత

22-09-2020 Tue 08:38
Tollywood senior actor seetha passes away
  • కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీత
  • 250కిపైగా సినిమాలు, 2 వేల వరకు నాటక ప్రదర్శనలు
  • 1956లో నటుడు నాగభూషణం‌తో వివాహం

కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి సీత నిన్న హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో నిన్న ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి. దిగ్గజ దర్శకుడు కేవీరెడ్డి రూపొందించిన ‘యోగి వేమన’ సినిమాతో ఆమె చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ సినిమాలో ఆమె బాలనటిగా కనిపించారు. హాస్య నటిగా గుర్తింపు తెచ్చుకున్న సీత.. మాయాబజార్, గుణసుందరి కథ, పెళ్లినాటి ప్రమాణాలు, పెద్దమనుషులు, స్వర్ణసుందరి, స్వప్నసుందరి, పరమానందయ్య శిష్యులు, పల్నాటియుద్ధం, పంతులమ్మ, నలదమయంతి తదితర సినిమాల్లో నటించారు.

2002లో చివరిసారి ‘నేనేరా పోలీస్’ సినిమాలో కనిపించారు. సుమారు 250 సినిమాల్లో నటించిన సీత.. 2 వేల వరకు నాటక ప్రదర్శనలు ఇచ్చారు. రుతురాగాలు వంటి బహుళ ప్రేక్షకాదరణ పొందిన సీరియల్‌లోనూ నటించారు. రక్తకన్నీరు నాటకం సమయంలో ప్రముఖ నటుడు నాగభూషణంతో అయిన పరిచయం పెళ్లికి దారితీసింది. 1956లో ఆయనను వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె భువనేశ్వరి, కుమారుడు సురేందర్ ఉన్నారు.