నాగ చైతన్యకు కథ చెప్పిన 'రంగ్ దే' దర్శకుడు!

21-09-2020 Mon 17:21
Naga Chaitanya to do a sports drama movie
  • శేఖర్ కమ్ములతో 'లవ్ స్టోరీ' చేస్తున్న చైతు 
  • తదుపరి చిత్రం విక్రంకుమార్ తో 'థ్యాంక్యూ'
  • స్పోర్ట్స్ డ్రామా కథ చెప్పిన వెంకీ అట్లూరి
  • త్వరగా పూర్తి స్క్రిప్టుతో రమ్మని చెప్పిన చైతు  

ఇటీవలి కాలంలో మన యంగ్ హీరోలు స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో రూపొందే చిత్రాల పట్ల ఆసక్తి చూపుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇలాంటి చిత్రాలు తమకి విభిన్నంగా ఉండడమే కాకుండా, అభినయం పరంగా కూడా తమకి ఛాలెంజింగ్ గా ఉంటాయన్నది వారి ఆలోచన. అందుకే, అలాంటి స్క్రిప్టు వస్తే కనుక ఎవరూ వదులుకోవడం లేదు. తాజాగా అక్కినేని నాగ చైతన్య వద్దకు కూడా అలాంటి కథ ఒకటి వచ్చిందట.

ప్రస్తుతం నితిన్ హీరోగా 'రంగ్ దే' చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా చైతన్యకి ఓ కథ చెప్పాడట. స్పోర్ట్స్ డ్రామాతో సాగే ఈ కథ చైతుకి బాగా నచ్చిందని, త్వరగా పూర్తి స్క్రిప్టుతో రమ్మనమని చెప్పాడని తెలుస్తోంది. దీంతో 'రంగ్ దే' పని పూర్తవగానే దీనిపై వర్క్ చేయాలని వెంకీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. 

ఇదిలావుంచితే, ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ 'లవ్ స్టోరీ' చిత్రాన్ని చేస్తున్నాడు. దీని తర్వాత విక్రంకుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' చిత్రం చేయనున్నట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి. మరోపక్క, ఇంద్రగంటి మోహన కృష్ణ, నందినీ రెడ్డి ప్రాజక్టులు కూడా చైతూ చేయాల్సి వుంది. ఈ నేపథ్యంలో వెంకీ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో చూడాలి మరి!