Chandrababu: ఆనాడు 30 మంది మృతికి కారణమైన చంద్రబాబు కూడా ఈ రోజు ధర్మం గురించి మాట్లాడుతున్నారు: సోము వీర్రాజు

Chadrababu talking about Hindu Dharma is ridiculous says Somu Veerraju
  • విజయవాడలో ఆలయాలను చంద్రబాబు కూల్పించారు
  • ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు ధర్మం ఏమైంది?
  • టీడీపీ, వైసీపీ రెండు పార్టీలకు జనాలు బుద్ధి చెపుతారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుష్కరాల సమయంలో 30 మంది మృతికి కారణమైన చంద్రబాబు ఈరోజు హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలకు జనాలు నవ్వుకుంటున్నారని చెప్పారు. ధర్మరాజు వంటి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు ధర్మం ఏమైందని ప్రశ్నించారు.

విజయవాడలో అనేక దేవాలయాలను కూల్చిన చరిత్ర చంద్రబాబుదని వీర్రాజు దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తి హిందూ ధర్మం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని చెప్పారు. గతంలో చేసిన పనులను చంద్రబాబు గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. టీడీపీ, వైసీపీ రెండూ ఒకటేనని చెప్పారు. రెండు ప్రభుత్వాల హయాంలలో హిందూ ఆలయాల కూల్చివేత, హిందూ ధర్మంపై దాడి జరుగుతోందని విమర్శించారు. హిందూ సమాజమంతా ఏకమై ఈ పార్టీలకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని జోస్యం చెప్పారు.

ఇదే సమయంలో హిందూ దేవుళ్ల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై కూడా వీర్రాజు మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన నాని తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Chandrababu
Telugudesam
Somu Veerraju
BJP
Kodali Nani
YSRCP

More Telugu News