Talasani: కేంద్రం తీసుకురాబోయే విద్యుత్ చట్టంపైనా ఉద్యమించక తప్పదు: తలసాని

Telangana minister Talasani Srinivas fires on new agriculture bill
  • కేంద్రం అగ్రి బిల్లుతో అగ్గి రాజుకుందన్న తలసాని
  • కార్పొరేట్ల కోసమే బిల్లు తెచ్చారంటూ ఆరోపణలు
  • దేశమంతా నిరసనలు వ్యాపిస్తాయని వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టం బిల్లు, ఇతర అనుబంధ బిల్లులకు నిన్న రాజ్యసభలో ఆమోదం లభించిన నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే ఈ బిల్లు తీసుకువచ్చారని, కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులతో దేశంలో అగ్గి రాజుకుందని అన్నారు.

ఈ బిల్లుల పట్ల దేశంలోని రైతులంతా మండిపడుతున్నారని, రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్న బీజేపీకి శిక్ష తప్పదని హెచ్చరించారు. రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ముందుకు సాగిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు.

ఈ బిల్లులపై ఇప్పటికే పంజాబ్, హర్యానా రాష్ట్రాలు భగ్గుమంటున్నాయని, తీవ్ర నిరసనలు వస్తున్నాయని, మరికొన్ని రోజుల్లో ఇది దేశమంతా వ్యాపిస్తుందని తెలిపారు. కేంద్రం తీసుకురాబోయే నూతన విద్యుత్ చట్టంపైనా ఇదే విధంగా ఉద్యమించక తప్పదని అన్నారు.

బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని, మున్ముందు ఇలాంటి బీజేపీ రాజకీయాలు చెల్లవని అన్నారు. ఓవైపు కరోనా మహమ్మారి చెలరేగిపోతుంటే, బీజేపీ మాత్రం ప్రభుత్వాలను పడగొట్టడంలో ముమ్మరంగా శ్రమిస్తోందని విమర్శించారు.

  • Loading...

More Telugu News