Rajya Sabha: రాజ్యసభలో నిన్నటి రగడపై ప్రభుత్వం సీరియస్... 8 మందిపై సస్పెన్షన్ వేటు!

  • నిన్న వ్యవసాయ బిల్లులపై ఓటింగ్
  • గందరగోళం తరువాత బిల్లులకు ఆమోదం
  • సభను అగౌరవ పరిచారని వెంకయ్య ఆగ్రహం
8 members suspended from Rajyasabha

ఆదివారం నాడు రాజ్యసభలో వ్యవసాయ బిల్లులపై ఓటింగ్ సందర్భంగా జరిగిన ఘటనలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పోడియంలోకి దూసుకు రావడంతో పాటు, సభా మర్యాదలకు భంగం కలిగించారని, డిప్యూటీ చైర్మన్ పై దాడి చేశారని ఆరోపిస్తూ, 8 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసింది. వీరందరినీ ప్రస్తుత రాజ్యసభ సమావేశాలు ముగిసేంత వరకూ సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.

వీరంతా సభ్య సమాజం సిగ్గు పడే రీతిలో సభలో ప్రవర్తించారని, ఏ మాత్రమూ నియంత్రణ లేకుండా, గౌరవ డిప్యూటీ చైర్మన్ పై దాడికి ప్రయత్నించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా, సస్పెండ్ అయిన వారిలో ఆమ్ ఆద్మీకి చెందిన సంజయ్‌ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన డెరిక్ ఓబ్రెన్, డోలాసేన్, కాంగ్రెస్ కు చెందిన రాజీవ్ వాస్తవ్, రిపూన్ బోరా, సయ్యద్ నజీర్ హుస్సేన్, సీపీఎంకు చెందిన కరీమ్, కేకే రాజేష్ ఉన్నారు.

ఇక వీరి సస్పెన్షన్ ను ప్రవేశపెట్టిన తరువాత సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. మరోసారి విపక్ష సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చి, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. గందరగోళం మధ్యే ఈ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టు వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఆ తరువాత కూడా సస్పెండ్ అయిన సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ ను పిలవాల్సి వచ్చింది.

More Telugu News