రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు: లోకేశ్

20-09-2020 Sun 17:17
Nara Lokesh says tears from farmers not good for state
  • ఉచిత విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు
  • రైతులు మీటర్లు వద్దంటున్నారన్న లోకేశ్
  • రైతు వ్యతిరేక నిర్ణయాలను ఖండిస్తున్నట్టు ప్రకటన

ఏపీలో ఉచిత విద్యుత్ వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని స్పష్టం చేశారు. రైతాంగం అంతా ఒక్కటై ఈ దగా మీటర్లు మాకొద్దని అంటున్నా, జగన్ బలవంతంగా మీటర్లు పెడుతున్నారని ఆరోపించారు.

ఎన్ని కేసులు పెట్టినా ఫర్వాలేదు, మీటర్లు పెట్టడానికి మాత్రం అంగీకరించం అంటూ రైతులు ఓవైపు ఆందోళన చేస్తున్నా... అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం మర్తాడు గ్రామంలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు అధికారులు ప్రయత్నించడం దారుణం అని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా లోకేశ్ పంచుకున్నారు.