Raghu Rama Krishna Raju: "అప్పుడు ముద్దుల ప్రియుడు... ఇప్పుడు గుద్దుల ప్రియుడు" అంటూ సీఎం జగన్ పై రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు

  • డిక్లరేషన్ అంశంపై మాట్లాడిన రఘురామకృష్ణరాజు
  • బైబిల్ పక్కన పెట్టుకుని జగన్ ప్రమాణస్వీకారం చేశారన్న రఘురామ
  • సీఎం క్రైస్తవుడని అందరికీ తెలిసిందంటూ వ్యాఖ్యలు
  • తిరుమలలో జగన్ సంతకం చేయాలని హితవు
Narasapuram MP Raghurama Krishna Raju comments on CM Jagan

ఏపీ సీఎం జగన్ ఈ నెల 23న తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో డిక్లరేషన్ పై సంతకం పెడతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో గంగాస్నానం చేసినప్పుడు ఎంతోమంది జగన్ ను నమ్మారని, కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో పక్కన కేవలం బైబిల్ మాత్రమే ఉండడంతో ఆయనపై క్రైస్తవుడు అనే ముద్ర పడిందని స్పష్టం చేశారు. బైబిల్ ను పక్కనబెట్టుకోవడంలో తప్పులేదని, ఎవరి విశ్వాసాలు వారివని అన్నారు.

కానీ, సీఎం జగన్ ఎంతో పాప్యులర్ కాబట్టి ప్రమాణస్వీకారోత్సవాన్ని ఎంతోమంది చూసుంటారని, ఆయన క్రిస్టియన్ అన్న సంగతి అందరికీ తెలిసిందని వివరించారు. "'సీఎం జగన్ ప్రమాణస్వీకారం సందర్భంగా భగవద్గీత, ఖురాన్ కాకుండా బైబిల్ పక్కన ఉంచుకున్నారు. అలాకాకుండా భగవద్గీత, ఖురాన్, బైబిల్ మూడింటిని పక్కన పెట్టుకుని ఉంటే మరోలా ఉండేది. ఇప్పుడు మీరు క్రిస్టియన్ అని అందరూ గుర్తించారు. అందుకే మీరు ధర్మాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టండి.

గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు? ఒక్క సంతకమే కదా! పెట్టేయండి! నేను ఈ మతాన్ని గౌరవిస్తున్నాను అంటూ ఒక్క సంతకం పెడితే మీరు సెక్యులర్ అని భావిస్తారు. హిందువుల హృదయాల్లో నిలిచిపోతారు. ఇదేమన్నా అందరికీ సరదానా? అందరూ మిమ్మల్ని ప్రేమించేవాళ్లే. మీరు కూడా అందరినీ ప్రేమిస్తారు. గతంలో పాదయాత్ర సందర్భంగా అవ్వాతాతలపై చూపించిన ప్రేమ, పసిపిల్లలపై చూపించిన అవ్యాజానురాగమైన ప్రేమ ఇంకా ప్రజల్లో అలాగే నిలిచిపోయింది.

ఒకవిధంగా చెప్పాలంటే ఆ రోజుల్లో మీరు చూపిన ప్రేమకు మిమ్మల్ని ముద్దుల ప్రియుడిగా పిలుచుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడున్న కొవిడ్ పరిస్థితుల్లో మీరు బయట పెద్దగా తిరగలేకపోతుండవచ్చు. కానీ బయట జరుగుతున్న పరిణామాలతో మిమ్మల్ని ముద్దుల ప్రియుడికి బదులు గుద్దుల ప్రియుడు అనుకుంటున్నారు. కొందరిపై పోలీసు దాడులు, ఇటీవల ఘటనలతో ఈ దెబ్బలేంట్రా బాబూ అని ప్రజలు బాధపడుతున్నారు. మనకి ఇలాంటి చెడ్డపేరు వద్దు సార్" అంటూ హితవు పలికారు.

More Telugu News