పాయల్ ఘోష్ ఆరోపణలపై స్పందించిన బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్

20-09-2020 Sun 13:55
Bollywood director Anurag Kashyap reacts to Payal Ghosh allegations
  • కశ్యప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన పాయల్
  • పాయల్ వ్యాఖ్యలను ఖండించిన కశ్యప్
  • నిజమేంటో భవిష్యత్తులో అందరికీ తెలుస్తుందంటూ ట్వీట్

తనపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ అసభ్యంగా ప్రవర్తించారని, ఓ గదిలోకి తీసుకెళ్లి దుస్తులు విప్పేందుకు ప్రయత్నించాడని నటి పాయల్ ఘోష్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. పాయల్ వ్యాఖ్యల అనంతరం తనకు చాలామంది నుంచి సందేశాలు, ఫోన్ కాల్స్ వస్తున్నాయని వెల్లడించారు. పాయల్ ఆరోపణల పట్ల స్పందించవద్దని చాలామంది సన్నిహితులు తనతో చెప్పారని, అయినప్పటికీ తాను జవాబు చెప్పడానికి ముందుకు వచ్చానని కశ్యప్ వివరించారు.

పాయల్ ను ఉద్దేశించి ఆయన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. "మీరు ఓ మహిళ అయి ఉండి కూడా నాతో కొంతమంది నటీమణులకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు... ఇది మీకు తప్పుగా అనిపించడంలేదా? నన్ను ఇబ్బందుల పాల్జేసే క్రమంలో మీరు బచ్చన్ ఫ్యామిలీ సహా మరికొందరు ఇతర హీరోయిన్లను ఇందులోకి లాగే ప్రయత్నం చేశారు. ఓ దర్శకుడిగా ఎంతోమంది హీరోయిన్లతో మాట్లాడుతుంటాను... అలాగని వాళ్లతో ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించలేదు.

నేను రెండు వివాహాలు చేసుకున్నది నిజమే. ఒకవేళ అలా రెండు పెళ్లిళ్లు చేసుకోవడం నేరమంటే ఆనందంగా ఒప్పుకుంటాను. కానీ, మీరు నాపై ఓ ఇంటర్వ్యూలో చేసిన ఆరోపణల్లో ఎంత వాస్తవం ఉందో, ఎంత అవాస్తవం ఉందో భవిష్యత్తులో అందరికీ తెలుస్తుంది. ప్రతిదానికి కొన్ని హద్దులు ఉంటాయి మేడమ్... మీరు నన్ను ఇరకాటంలో పడేసేందుకు చాలా టైమ్ తీసుకున్నారు. మీరు నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పడానికే స్పందించాల్సి వస్తోంది" అంటూ అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యానించారు.