ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతున్న వేళ, పిడుగు పడి ఆటగాడి మృతి!

20-09-2020 Sun 11:09
Footballer killed in Thunder Strom
  • రాంచీ సమీపంలో ఘటన
  • వర్షం పడుతున్నా మ్యాచ్ కొనసాగించిన నిర్వాహకులు
  • కేసును విచారిస్తున్న పోలీసులు

జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ సమీపంలో ఓ ఫుట్ ‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతున్న వేళ పిడుగుపడి ఓ ఆటగాడు మరణించిన విషాద ఘటన మ్యాచ్ చూస్తున్న అభిమానుల్లో విషాదాన్ని నింపింది. మావోయిస్టు ప్రభావిత గ్రామంగా ముద్రపడిన ఉరుబార్డిలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ నెమాన్‌ కుజుర్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్ ‌షిప్ ‌లో భాగంగా మ్యాచ్ జరుగుతూ ఉండగా, మధ్యలో వర్షం మొదలైంది. అయినా నిర్వాహకులు ఆటను కొనసాగించారు.

ఇదే సమయంలో మైదానంలో పెద్ద శబ్దం చేస్తూ పిడుగు పడింది. ఇది పరాస్‌ పన్నా అనే యువ ఆటగాడితోపాటు మరో నలుగురిని తాకింది. వెంటనే వీరిని సమీపంలోని గుమ్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరాస్ పన్నా మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామానికి చేరుకుని, విచారణ ప్రారంభించారు. ఇదే సమయంలో లాక్ ‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఆటను నిర్వహించినందుకు కేసు నమోదు చేశామని చైన్ ‌పూర్‌ సబ్‌ డివిజనల్‌ పోలీస్ ఆఫీసర్ కుల్దీప్‌ కుమార్‌ వెల్లడించారు.