డ్రగ్స్ విక్రయిస్తున్న కన్నడ నటుడు అమన్ శెట్టి అరెస్ట్!

20-09-2020 Sun 09:18
Kannada Actor Aman Shetty Arrest in Drugs Case
  • మరో వ్యక్తితో కలిసి దందా
  • అమన్ తో పాటు అఖీల్ నౌషీల్ అరెస్డ్
  • ఎన్డీపీసీ చట్టం కింద కేసు నమోదు

కన్నడనాట తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరిలో నటుడు, కొరియోగ్రాఫర్ కిశోర్ అమన్ శెట్టి కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని వెల్లడించిన మంగళూరు సిటీ పోలీసు కమిషనర్ వికాశ్ కుమార్, వీరిద్దరూ మాదకద్రవ్యమైన 'ఎండీఎంఏ'ను విక్రయించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. వీరిద్దరూ కలిసి డ్రగ్స్ సంపాదించిన తరువాత, బైక్ పై వెళుతూ పట్టుబడ్డారని, రెండో వ్యక్తిని అఖీల్ నౌషీల్ గా గుర్తించామని తెలిపారు.

వీరికి డ్రగ్స్ ముంబై నుంచి వచ్చాయని గుర్తించామని, తదుపరి దర్యాఫ్తు కొనసాగుతోందని అన్నారు. నిందితుల నుంచి లక్ష రూపాయల విలువ చేసే డ్రగ్స్ తో పాటు మోటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్లను సీజ్ చేశామని, ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్సైకోట్రాపిక్ సబ్ స్టాన్సెస్) చట్టం కింద వీరిపై కేసును రిజిస్టర్ చేశామని తెలిపారు.

కాగా అమన్ శెట్టి, 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్' కార్యక్రమంతో పాప్యులర్ అయి, ఆపై బాలీవుడ్ సినిమా 'ఏబీసీడీ: ఎనీ బడీ కెన్ డ్యాన్స్' చిత్రంలోనూ నటించాడు. ఇక ఇదే కేసులో ఇద్దరు విదేశీయులను కూడా పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.