మోదీ పుట్టిన రోజు వేడుకలు చేస్తుంటే ప్రమాదం... వీడియో ఇదిగో!

20-09-2020 Sun 09:12
Explosion in Modi Birthday Celebrations
  • చెన్నైలో కార్యకర్తల ఉత్సాహం
  • హీలియం బెలూన్లను తాకిన బాణాసంచా
  • డజను మందికి పైగా గాయాలు

ప్రధాని నరేంద్రమోదీ 70వ పుట్టిన రోజు వేడుకలను ఆనందోత్సాహాల మధ్య చేస్తున్న వేళ జరిగిన ప్రమాదం డజను మందికి పైగా బీజేపీ కార్యకర్తలను గాయపరిచింది. చెన్నైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వేడుకల కోసం హీలియం బెలూన్లు, భారీ ఎత్తున బాణాసంచాను సిద్ధం చేయగా, అవన్నీ ఒక్కసారిగా పేలాయి. కార్యకర్తలు పట్టుకున్న హీలియం బెలూన్లకు మంటలు అంటుకోవడంతో పేలుడు సంభవించింది. ఆపై బాణాసంచా మొత్తం పేలిపోయింది. దీంతో కార్యకర్తలంతా పరుగులు పెట్టారు. ఇదే ప్రమాదంలో బందోబస్తు విధుల నిమిత్తం వచ్చిన పోలీసులు కూడా గాయపడ్డారు.

"ఈ ప్రమాదంలో డజను మందికి పైగా గాయపడ్డారు. గాయాలన్నీ చిన్నచిన్నవే. ఎవరికీ ప్రాణాపాయం లేదు. హీలియం నింపిన బెలూన్లకు బాణాసంచా తగలడమే ఈ ప్రమాదానికి కారణం" అని తమిళనాడు బీజేపీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ బెలూన్లలో ఏ వాయువును నింపారో తమకు తెలియదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని, భౌతిక దూరాన్ని పాటించలేదని కేసు పెట్టి, విచారిస్తున్నామని అన్నారు.