ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో టాస్ గెలిచిన ధోనీ

19-09-2020 Sat 19:22
Dhoni wins toss and choose field first in IPL opener against mighty Mumbai Indians
  • యూఏఈ వేదికగా ఐపీఎల్
  • తొలి మ్యాచ్ లో ముంబయి వర్సెస్ చెన్నై
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోనీ

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఎట్టకేలకు షురూ అవుతోంది. అబుదాబి వేదికగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ మందకొడిగా ఉంటుందన్న నేపథ్యంలో ధోనీ నిర్ణయం ఎంతమేరకు పనిచేస్తుందో చూడాలి.

ఈ మ్యాచ్ కోసం ముంబయి ఇండియన్స్ అత్యంత పటిష్టమైన జట్టుతో బరిలో దిగుతోంది. బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య జట్టుకు అండగా ఉండగా, బౌలింగ్ లో ఆసీస్ స్పీడ్ స్టర్ జేమ్స్ ప్యాటిన్సన్ రాకతో మరింత పదును పెరిగింది. ప్యాటిన్సన్ అటుంచితే టీమిండియా యువ సంచలనం జస్ప్రీత్ బుమ్రా ఫుల్ ఫిట్ నెస్ తో ఉండడం కలిసొచ్చే అంశం. వీరిద్దరికీ తోడు న్యూజిలాండ్ లెఫ్టార్మ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ కూడా సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు.

ఇక చెన్నై జట్టులోనూ మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు. కెప్టెన్ ధోనీ, షేన్ వాట్సన్, డుప్లెసిస్, రాయుడు, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజాలతో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. పూర్తి ఫిట్ నెస్ సాధించని డ్వేన్ బ్రావో ఈ మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడం కొద్దిగా లోటే అయినా, ఇంగ్లాండ్ యువ ఆల్ రౌండర్ శామ్ కరన్ రాణిస్తే అదేమంత విషయం కాదని చెన్నై సూపర్ కింగ్స్ శిబిరం భావిస్తోంది.