నిన్నటి నుంచి నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నారు: ఎస్పీ బాలు ఆరోగ్యంపై లేటెస్ట్ అప్ డేట్

19-09-2020 Sat 19:06
SP Balu has taken oral food intake since yesterday
  • బాలుకు కరోనా అనంతర చికిత్స
  • లేచి కూర్చుంటున్నారన్న తనయుడు చరణ్
  • ఎక్మో, వెంటిలేటర్ సాయం కొనసాగుతోందని వెల్లడి

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తాజా సమాచారం పంచుకున్నారు. నెలరోజులకు పైగా కరోనా మహమ్మారితో పోరాడిన  ఎస్పీ బాలుకు కరోనా నెగెటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో కరోనా అనంతర చికిత్స కొనసాగుతోంది.

దీనిపై తాజా వీడియోలో ఎస్పీ చరణ్ మాట్లాడుతూ, తన తండ్రి నిన్నటి నుంచి నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నారని, ఇకపై ఆయన త్వరగా శక్తిని పుంజుకుంటారని భావిస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు కొన్ని నిమిషాల పాటు లేచి కూర్చుంటున్నారని, ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటున్నారని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కీలకమైన ఆరోగ్య సూచీలు సాధారణ స్థితిలోనే ఉన్నాయని చరణ్ తెలిపారు. అయినప్పటికీ ఎక్మో, వెంటిలేటర్ సాయం కొనసాగిస్తున్నారని వెల్లడించారు.

ఎంజీఎం వైద్య బృందం అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని, తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వివరించారు.