ఉభయ గోదావరి జిల్లాల్లో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి

19-09-2020 Sat 17:41
Corona spreading continue in East and West Godavari districts
  • రెండు జిల్లాల్లో వెయ్యికి పైగా కొత్త కేసులు
  • రాష్ట్రంలో తాజాగా 58 మంది మృతి
  • మరో 10,820 మందికి కరోనా నయం

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ఈ రెండు జిల్లాల్లో మరోసారి వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు వచ్చాయి. గడచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 1,395, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,071 కేసులు వెల్లడయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఐదుగురు కరోనాతో మృతి చెందగా, తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా చూస్తే తాజాగా 8,218 పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 58 మంది మరణించారు. కాగా, 10,820 మందికి కరోనా నయమైందని తాజా హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు. ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,17,776కి చేరింది. మరణాల సంఖ్య 5,302కి పెరిగింది. మొత్తం 5,30,711 మంది కరోనా నుంచి విముక్తులు కాగా, ఇంకా 81,763 మంది చికిత్స పొందుతున్నారు.