రైతులకు సందేశం ఇవ్వడం కోసం... కొబ్బరి చెట్టెక్కి ప్రసంగించిన శ్రీలంక మంత్రి

19-09-2020 Sat 17:23
Sri Lankan minister climbed a coconut tree
  • శ్రీలంక మంత్రి అరుందిక ఫెర్నాండో వీడియో వైరల్
  • లంకలో కొబ్బరికాయల కొరత
  • విస్తృతంగా పండించాలంటూ రైతులకు పిలుపునిచ్చిన మంత్రి

శ్రీలంక మంత్రి అరుందిక ఫెర్నాండో ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. దేశంలో కొబ్బరికాయల కొరత ఉందని, ఆ లోటును అధిగమించాల్సి ఉందన్న సందేశాన్ని రైతులకు ఇవ్వడం కోసం స్వయంగా కొబ్బరిచెట్టు ఎక్కి ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

శ్రీలంకలో కొబ్బరికాయలకు అత్యధిక డిమాండ్ ఏర్పడిందని, 700 మిలియన్ల కొబ్బరికాయల లోటు ఏర్పడిందని మంత్రి చెప్పారు. స్థానిక పరిశ్రమలు, దేశీయ అవసరాల కోసం కొబ్బరికాయల వినియోగం పెరిగినందున డిమాండ్ ఏర్పడిందని వివరించారు. అందుకే, అందుబాటులో ఉన్న ప్రతి ఖాళీ స్థలంలో కొబ్బరి పంట సాగు చేయాలని రైతులకు ఫెర్నాండో పిలుపునిచ్చారు. కొబ్బరి పంటను విస్తృతంగా సాగు చేసి పరిశ్రమకు దన్నుగా నిలవడమే కాకుండా, దేశానికి విదేశీ మారకద్రవ్యం ఆర్జించడంలో తోడ్పాటు అందించాలని సూచించారు.

కాగా, మంత్రి ఫెర్నాండో కొబ్బరి చెట్లు ఎక్కేందుకు ఉపయోగించే ఆధునిక పరికరం సాయంతో చెట్టు ఎక్కారు. ఓ చేతిలో కొబ్బరికాయతో ఆయన ప్రసంగించారు.