ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి: కంగన కితాబు

19-09-2020 Sat 12:49
Kangana Ranaut comments on Tollywood and Ramoji Film City
  • ఇండియాలో హిందీ సినీ పరిశ్రమ టాప్ కాదు
  • టాలీవుడ్ ఎప్పుడో అగ్ర స్థానానికి ఎదిగింది
  • రామోజీ ఫిలిం సిటీలో ఎన్నో షూటింగులు జరుగుతున్నాయి 

ఇండియాలో హిందీ సినీ పరిశ్రమే టాప్ అని జనాలు అనుకుంటుంటారని... అది తప్పు అని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ అగ్ర స్థానానికి ఎదిగిందని చెప్పారు. అనేక భాషల్లో ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయని అన్నారు. హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఎన్నో హిందీ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయని చెప్పారు.

సినీ రంగంలో ఎన్నో సంస్కరణలు రావాల్సి ఉందని కంగన అన్నారు. అన్ని భాషల ఇండస్ట్రీలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి... ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా తయారు చేయాలని సూచించారు. అనేక కారణాల వల్ల భారతీయ సినీ పరిశ్రమ విడిపోయిందని చెప్పారు. మన సినీ పరిశ్రమలో ఐక్యత లేకపోవడం హాలీవుడ్ సినిమాలకు లాభిస్తోందని అన్నారు. మనది ఒకే ఇండస్ట్రీ అయినా అనేక ఫిలిం సిటీలు ఉన్నాయని చెప్పారు.

ఎన్నో గొప్ప ప్రాంతీయ సినిమాలు ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావడం లేదని... కానీ, డబ్ అయిన హాలీవుడ్ సినిమాలు మాత్రం ప్రాధాన్యతను పొందుతున్నాయని కంగన అన్నారు. థియేటర్లపై కొందరి గుత్తాధిపత్యం, హాలీవుడ్  సినిమాలకు మీడియా ఇస్తున్న ప్రాధాన్యత దీనికి కారణమని విమర్శించారు.