తూచ్.. నేనలా అనలేదు.. వ్యవసాయ బిల్లులపై ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ యూటర్న్!

19-09-2020 Sat 11:47
harsimrat kaur badal takes u turn on bill
  • వ్యవసాయ సవరణ బిల్లును వ్యతిరేకించి రాజీనామా చేసిన హర్‌సిమ్రత్
  • రైతు వ్యతిరేక బిల్లు అనలేదన్న ఎంపీ
  • రైతు సంక్షేమం కోరే ఆ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరణ

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వ్యవసాయ సవరణ బిల్లును వ్యతిరేకించి మంత్రి పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించిన శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ యూటర్న్ తీసుకున్నారు.

తాజాగా ఓ జాతీయ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ, కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ సవరణ బిల్లును రైతు వ్యతిరేక బిల్లు అని తాను అనలేదని స్పష్టం చేశారు. అలాంటి వ్యాఖ్యలు తాను చేయలేదని, రైతులే ఆ మాట అన్నారని పేర్కొన్నారు. రైతుల క్షేమం కోరే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందంటూ మాట మార్చారు. రైతులందరూ ఈ విషయాన్ని గుర్తించి బిల్లుకు మద్దతు పలకాలని కోరడం గమనార్హం.

కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి పదవికి హర్‌సిమ్రత్ కౌర్ రెండు రోజుల క్రితం రాజీనామా చేశారు. రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌లు, చట్టాలకు నిరసనగానే మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు. ఓ సోదరిగా రైతుల పక్షాన నిలబడటం ఎంతో గర్వంగా ఉందని రాజీనామా అనంతరం ట్వీట్ చేశారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. అయితే, అంతలోనే ఆమె యూటర్న్ తీసుకోవడంతో కొత్త చర్చ తెరపైకి వచ్చింది.