Pakistan: 'కశ్మీర్ వాంట్స్ ఫ్రీడమ్' హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్న పాకిస్థాన్!

  • ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపిన పాక్
  • పలు దేశాల్లో ట్విట్టర్ సైన్యంతో విష ప్రచారం
  • కుటిల పన్నాగాలంటున్న అధికారులు
Pakisthan Virals Kashmir Wants Freedom Hashtag

ఇండియాపై మరో రకమైన ప్రచ్ఛన్న యుద్ధానికి పాకిస్థాన్ తెరలేపింది. ఇరు దేశాల మధ్యా దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షించడమే లక్ష్యంగా ఈ కుట్రకు తెరలేపింది. ఐరాసలో 75వ సాధారణ చర్చలు జరగడానికి కొన్ని రోజుల ముందు ట్విట్టర్ వేదికగా భారత్ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందుకోసం 'కశ్మీర్ వాంట్స్ ఫ్రీడమ్' పేరిట ప్రత్యేక హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తూ, తమవారితో మద్దతు లభించేలా చూస్తోంది.

ఇందుకోసం తన దేశానికి చెందిన ట్విట్టర్ సైన్యాన్ని పాకిస్థాన్ పలు దేశాల్లో వినియోగిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, కువైట్, సౌదీ అరేబియా, మలేషియా, ఖతార్ తదితర దేశాల్లో ఇండియాపై వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించింది. కాగా, ఇటీవలి కాలంలో అంతర్జాతీయ సమాజం ఎదుట పాక్ ఎంతగా ప్రయత్నించినా, భారత వ్యతిరేక ప్రచారం సాగలేదన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇదే సమయంలో కశ్మీర్ లో ప్రజల అభివృద్ధికి భారత ప్రభుత్వం చేపడుతున్న చర్యలను గమనిస్తున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ వాసులు, ఇమ్రాన్ సర్కారుకు వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్న వేళ, భారత చర్యలను తక్కువ చేసి చూపాలన్న అభిప్రాయంతో, పాక్ ఈ కుటిల పన్నాగాలు పన్నుతోందని సీనియర్ ఐఏఎస్ అధికారులు అంటున్నారు. కశ్మీర్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, భారత్ అక్కడి వారిని అణచి వేస్తోందని పాక్ దుష్ప్రచారం చేస్తోంది.

More Telugu News