Blue Print: కీలకమైన కరోనా వ్యాక్సిన్ బ్లూ ప్రింట్ వివరాలను బహిర్గతం చేసిన మోడెర్నా, ఫైజర్

Moderna and Pfizer reveals their corona vaccine blue print
  • కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు నిర్వహిస్తున్న మోడెర్నా, ఫైజర్
  • తమ వ్యాక్సిన్ సమర్థతపై బ్లూ ప్రింట్ రూపంలో వెల్లడి
  • క్లినికల్ ట్రయల్స్ దశలో మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లు
కరోనా వైరస్ భూతం యావత్ ప్రపంచానికి సవాల్ విసురుతున్న వేళ వ్యాక్సిన్ కోసం యుద్ధ ప్రాతిపదికన పరిశోధనలు సాగుతున్నాయి. ఇప్పటికే పలు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో చివరి అంకానికి చేరుకున్నాయి. అయితే, కొన్ని వ్యాక్సిన్ల సామర్థ్యం, వాటి పరిశోధన తీరుతెన్నులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, రష్యా తీసుకువస్తున్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఎంతమేరకు సురక్షితం అన్నది ఓ ప్రశ్నార్థకంగా మారింది. రష్యా మాత్రం తమ వ్యాక్సిన్ ఎంతో ప్రభావవంతమైనదని చెప్పుకుంటోంది.

ఈ నేపథ్యంలో తాము తయారుచేస్తున్న వ్యాక్సిన్లపై ఇలాంటి అనుమానాలు రాకుండా అమెరికాకు చెందిన మోడెర్నా, ఫైజర్ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ అభివృద్ధి తాలూకు అన్ని వివరాలను వెల్లడించాయి. ఈ మేరకు అత్యంత కీలకమైన బ్లూ ప్రింట్ ను బహిర్గతం చేశాయి. మోడెర్నా సంస్థ దీనికి సంబంధించిన 135 పేజీల మేర వివరాలు విడుదల చేసింది.

వ్యాక్సిన్ ప్రయోగాల కోసం వలంటీర్లను ఎంచుకునే విధానం, వారిపై పర్యవేక్షణ తీరుతెన్నులు, ప్రయోగాల్లో అపశ్రుతులు వస్తే అప్పటికప్పుడు ప్రయోగాలను నిలిపివేసేందుకు పాటించే విధానాలతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న వలంటీర్ల ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే మొత్తం వివరాలు ఈ బ్లూ ప్రింట్ లో ఉంటాయి. తమ బ్లూప్రింట్ విడుదల చేయడం ద్వారా తమ వ్యాక్సిన్లు ఎంతో సురక్షితమని మోడెర్నా, ఫైజర్ చాటిచెప్పే ప్రయత్నం చేశాయి.

సాధారణ పరిస్థితుల్లో బ్లూ ప్రింట్ ను ప్రయోగాలన్నీ ముగిసిన తర్వాతే విడుదల చేస్తారు. కానీ వ్యాక్సిన్ ల సామర్థ్యంపై సందేహాలు వస్తున్న తరుణంలో వీటిని ముందే బహిర్గతం చేస్తున్నారు.
Blue Print
Moderna
Pfizer
Vaccine
Corona Virus
USA

More Telugu News