Nadendla Manohar: ఈ అరెస్టులను ఖండిస్తున్నాం.. అసలైన దోషులను తక్షణమే అదుపులోకి తీసుకోండి: నాదెండ్ల మనోహర్

Nadendla Manohar condemns Janasena workers arrests
  • హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు
  • గుడులు, రథాలపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయడం లేదు
  • ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ఒక హక్కు
ఏపీలో దేవాలయాలు, రథాలపై దాడులకు తెగబడుతున్న వారిని అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని... అయితే, ప్రభుత్వం ఆ దిశగా వెళ్లడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. దాడులకు పాల్పడిన వారిని పట్టించుకోకుండా... దాడులను నిరసించిన వారిని అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం ఒక హక్కు అని చెప్పారు. అంతర్వేదిలో రథం దగ్ధమైన నేపథ్యంలో అక్కడకు వెళ్లిన హిందూ సాధువులు, భక్తులు, నేతలను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఛలో అమలాపురం కార్యక్రమానికి తమ మిత్రపక్షమైన బీజేపీ పిలుపునిచ్చిందని మనోహర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని జనసేన నేతలు, శ్రేణులను నిన్న రాత్రి నుంచి గృహనిర్బంధంలో ఉంచడం, అరెస్ట్ చేయడం, నోటీసులు జారీ చేయడం వంటివి చేస్తున్నారని... అప్రజాస్వామికమైన ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న అసలైన దోషులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Nadendla Manohar
Janasena
Antharvedi
YSRCP
BJP

More Telugu News