Bandi Sanjay: కొత్త విద్యుత్ చట్టంపై జగన్ కు లేని ఇబ్బంది కేసీఆర్ కు ఎందుకు?: బండి సంజయ్

  • విద్యుత్ సవరణ చట్టం వద్దని టీఎస్ అసెంబ్లీ తీర్మానం
  • పార్లమెంట్ ముందుకే రాకుండా వద్దని ఎలా అంటారు?
  • అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్ధాలు చెప్పారు
  • తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు
Bandi Sanjay Fire on KCR

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విద్యుత్ సవరణ చట్టంపై పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు లేని ఇబ్బంది తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎందుకో చెప్పాలని టీఎస్ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కొత్త చట్టంపై అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని, ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యుత్ చట్టం గురించి సరిగ్గా తెలియకుంటే, జగన్ ను ఇంకోసారి భోజనానికి పిలిచి, మాట్లాడి తెలుసుకోవాలని కేసీఆర్ కు సలహా ఇచ్చారు.

అసలు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టడానికి ముందే, వద్దంటూ అసెంబ్లీలో ఎలా తీర్మానం చేశారని ప్రశ్నించిన బండి సంజయ్, ఈ చట్టం అమలైతే, ఉద్యోగాలు ఎందుకు పోతాయో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉచిత విద్యుత్ పేరిట భారీ దొపిడీ జరుగుతోందని, కొత్త చట్టం వస్తే, తమ తమ దోపిడీ ఇక సాగబోదన్నదే టీఆర్ఎస్ నేతల భయమని ఆయన మండిపడ్డారు. విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరిపిస్తామని, ముఖ్యంగా పాతబస్తీలో జరుగుతున్న విద్యుత్ చౌర్యంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

More Telugu News