IMA: కరోనాతో మొత్తం 382 మంది వైద్యుల మృతి... హీరోలను కోల్పోతున్నామని ఐఎంఏ ఆవేదన!

IMA Fires on Center over Corona Data and Doctors Death
  • ప్రజారోగ్యం రాష్ట్రాల పరిధిలోనిదే
  • తమ వద్ద డేటా లేదన్న కేంద్రం
  • నైతిక హక్కును కేంద్రం కోల్పోయిందని ఐఎంఏ మండిపాటు
దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిపై పార్లమెంట్ లో ప్రకటన చేసిన కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఈ పోరాటంలో ముందు నిలిచి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వైద్యుల గురించిన ప్రస్తావన చేయకపోవడం, ఆరోగ్య పరిరక్షణ రాష్ట్రాల బాధ్యతైనందున తమ వద్ద పూర్తి సమాచారం లేదని ఆరోగ్య శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ దూబే వ్యాఖ్యానించడాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తప్పుబట్టింది. 1897 ఎపిడెమిక్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ లను నిర్వహించే నైతిక హక్కును కేంద్రం కోల్పోయిందని మండిపడింది.

కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకూ 382 మంది వైద్యులు మృతి చెందారని వెల్లడించిన ఐఎంఏ, 27 ఏళ్ల వయసు నుంచి 85 సంవత్సరాల వయసులోనూ వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్ వరకూ ఈ జాబితాలో ఉన్నారని తెలిపింది. కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తూ, బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తోందని, దీని ఫలితంగా మన హీరోలను కోల్పోతున్నామని అభిప్రాయపడింది. మరే ఇతర దేశంలోనూ వైద్యులు, హెల్త్ వర్కర్ల విషయంలో ఇండియాలో నమోదైనన్ని మరణాలు లేవని వెల్లడించింది.

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, అశ్విని కుమార్ దూబే మాటలు, బాధ్యతల నుంచి తప్పించుకునేందుకేనని ఆరోపించింది. ప్రజారోగ్యం, ఆసుపత్రులు రాష్ట్రాల పరిధిలోనివి కావడంతో, తమ వద్ద పరిహారం గణాంకాలు, ఇతర లెక్కలు లేవని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. కరోనాపై పోరాడుతున్న వైద్యులు లేకుంటే, ఇక ప్రజల పక్షాన ముందు నిలిచేది ఎవరని ప్రశ్నించిన ఐఎంఏ, మరణించిన వైద్యుల కుటుంబాలకు ఇస్తున్న బీమా కూడా సక్రమంగా లేదని తెలిపింది.
IMA
Corona Virus
Doctors
Center
Data

More Telugu News