aroori ramesh: వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ క్యాంపు కార్యాలయం కూల్చివేత

  • వరద నీటి కాలువపై ఐదేళ్ల క్రితం క్యాంపు కార్యాలయ నిర్మాణం
  • ఇటీవల వరదల నేపథ్యంలో నాలాలు విస్తరించాలని కేటీఆర్ ఆదేశం
  • నిన్న పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత
Wardhannapet MLA Aroori Ramesh Camp Office demolished

వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ క్యాంపు కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. వరంగల్ భద్రకాళి చెరువు నుంచి హంటర్ రోడ్డు ప్రధాన రహదారికి వచ్చే వరదనీటి కాలువపై ఐదేళ్ల క్రితం ఎమ్మెల్యే దీనిని నిర్మించారు. గత నెలలో వరంగల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలకు నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇటీవల వరంగల్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్ నాలాలను విస్తరిస్తే ముంపు బెడద ఉండదని భావించారు.

నాలాలపై చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నాలాపై నిర్మించిన అరూరి రమేశ్ క్యాంపు కార్యాలయంపై ఇటీవల వార్తలు వెల్లువెత్తాయి. స్పందించిన ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయ కూల్చివేతకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిన్న పోలీసు బందోబస్తు నడుమ అధికారులు కార్యాలయాన్ని కూల్చివేశారు.

More Telugu News