Corona Virus: భారత్‌లో మళ్లీ ప్రారంభమైన ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్ ప్రయోగాలు

  • ఇటీవల నిలిచిన ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ట్రయల్స్
  • బ్రిటన్‌లో వేయించుకున్న ఓ వ్యక్తికి ఆరోగ్య సమస్యలు
  • భారత్‌లో ట్రయల్స్‌కు మళ్లీ అనుమతులు ఇచ్చిన డీసీజీఐ
vaccine trials in india

కరోనా విజృంభణ వేళ ప్రపంచం ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌పై ఆశలు పెట్టుకోగా వాటి క్లినికల్ ట్రయల్స్‌ వికటించడంతో ప్రయోగాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌లో వేయించుకున్న ఓ వ్యక్తికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రయోగాలు నిలిచిపోయాయి.

అయితే, ఇటువంటి సమస్యలు సహజమేనని, బ్రిటన్‌కు చెందిన డేటా అండ్‌ సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డ్‌(డీఎస్ఎంబీ) తెలిపింది. అలాగే, ఆక్స్‌ఫర్డ్‌ టీకా సురక్షితమేనని మెడిసిన్స్‌ హెల్త్‌ రెగ్యులేటరీ అథారిటీ  తేల్చడంతో బ్రిటన్‌లో క్లినికల్స్‌ ట్రయల్స్‌ని పునఃప్రారంభించారు. అంతేగాక, భారత్‌లోనూ  డీఎస్‌ఎంబీ ఈ ప్రయోగాల పునఃప్రారంభానికి సిఫార్సు చేసింది.

ఈ నేపథ్యంలో  భారత్‌లో ఆ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ను మళ్లీ ప్రారంభించేందుకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతించింది.  ఈ మేరకు సీరం సంస్థకు పలు సూచనలు చేసింది. భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ ప్రయోగాల కోసం రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేయాలన్న ఆదేశాలనూ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ట్రయల్స్‌ను కొనసాగించాలని చెప్పింది.

స్క్రీనింగ్‌ దశలోనే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొంది. ట్రయల్స్‌ జరుపుతోన్న క్రమంలో దుష్ప్రభావాలు తలెత్తితే వాటిపై లోతుగా అధ్యయనం చేయాలని తెలిపింది. ఒకవేళ వాలంటీర్లకు అనారోగ్య సమస్యలు తలెత్తితే అందించాల్సిన చికిత్స, మందుల జాబితాను తమకు సమర్పించాలని తెలిపింది. డీఎస్ఎంబీ సిఫార్సుల ఆధారంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఇప్పటికే డీసీజీఐకి వాలంటీర్లకు సంబంధించిన సమాచారంతో పాటు, వ్యాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్ లో అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న జాగ్రత్తల్ని పునఃసమీక్షించి పంపించింది.

More Telugu News