Multiplex Association: థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాసిన మల్టీప్లెక్స్ అసోసియేషన్

Multiplex association writes to Centre to reopen cinema halls
  • లాక్ డౌన్ తో మూతపడిన సినిమా థియేటర్లు
  • ఇంకా అనుమతి ఇవ్వని కేంద్రం
  • వేల కోట్లు నష్టపోతున్నామన్న మల్టీప్లెక్స్ అసోసియేషన్
దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక మార్చి చివరి వారంలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్ లు మూతపడే ఉన్నాయి. అటు సినీ రంగంలోనూ షూటింగ్ లు, ఇతర కార్యకలాపాలు నిలిచిపోవడంతో నిస్తేజం అలముకుంది. పెద్ద హీరోలు సైతం తమ సినిమాలను ఓటీటీ వేదికల్లో రిలీజ్ చేసుకుంటున్నారు. ఇదే పరిస్థితి మరికొంతకాలం కొనసాగితే తాము మరింత తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ ల యజమానులు ఆందోళనకు గురవుతున్నారు.  

ఈ నేపథ్యంలో, మల్టీప్లెక్స్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మల్టీప్లెక్స్ లు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే అన్ లాక్ సినిమాస్ అండ్ సేవ్ జాబ్స్ అనే ప్రచారం కూడా మొదలుపెట్టిన మల్టీప్లెక్స్ అసోసియేషన్ తాజాగా కేంద్రానికి రాసిన లేఖలో అనేక అంశాలను ప్రస్తావించింది. అన్ లాక్-4లో రెస్టారెంట్లు, జిమ్ లు, షాపింగ్ మాల్స్ కు అనుమతులు ఇచ్చారని, తమకు కూడా అనుమతి ఇవ్వాలని కోరింది.

భౌతికదూరం నిబంధన కచ్చితంగా అమలు చేస్తామని, శానిటైజేషన్, మాస్కులు, పారిశుద్ధ్యం వంటి తప్పనిసరి జాగ్రత్తలన్నీ తీసుకుంటామని మల్టీప్లెక్స్ అసోసియేషన్ వెల్లడించింది. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్రదేశాల్లో సినిమా థియేటర్లలో ప్రదర్శనలు కొనసాగుతున్నాయని వివరించింది. లాక్ డౌన్ సమయంలో నెలకు రూ.1500 కోట్ల చొప్పున ఆర్నెల్లలో రూ.9 వేల కోట్ల మేర సినిమా థియేటర్ రంగం నష్టపోయిందని తెలిపింది.

దేశంలోని 10 వేల థియేటర్లు, వాటిపైనా, అనుబంధ రంగాలపైనా ఆధారపడి 2 లక్షల మంది వరకు ఉన్నారని, ఇప్పుడు వాళ్ల ఉపాధి ప్రశ్నార్థకమైందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ పేర్కొంది.  
Multiplex Association
Centre
Letter
Cinema Halls
Lockdown
Unlock
India

More Telugu News