Chandrababu: దుర్మార్గుల పాలనలో మంచివాళ్లు పడే కష్టాలకు మన రాష్ట్రమే ఉదాహరణ: చంద్రబాబు

  • టీడీపీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
  • ఆలయాలలో దాడులపై సీబీఐ విచారణకు డిమాండ్
  • ప్రతిపక్షాన్ని అణచివేయాలని పోలీసులు చూడరాదని హితవు
  • పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని సూచన
Chandrababu met party leaders via video conference

టీడీపీ సీనియర్ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే అమరావతి భూములపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. టీడీపీపై రాజకీయ కక్షతోనే అమరావతిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. దుర్మార్గుల పాలనలో మంచివాళ్లు పడే కష్టాలకు మన రాష్ట్రమే ఉదాహరణ అని పేర్కొన్నారు. తమ దోపిడీకి ఇదే చివరి అవకాశం అనే రీతిలో వైసీపీ బరితెగించిందని అన్నారు.

ప్రజల సహనానికి కూడా హద్దులు దాటిపోయాయని, వైసీపీ దుర్మార్గాలపై ప్రజలే తిరగబడే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఎస్సీ ఆడబిడ్డల మానానికి, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు, మాట్లాడే హక్కులేదని, ప్రాథమిక హక్కులనే కాదు, జీవించే హక్కులను కూడా కాలరాస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ ఏడాదిన్నరలో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులూ చేసిందని ఆరోపించారు. జంగారెడ్డి గూడెంలో నలుగురు ఎస్సీ యువకులపై దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర అత్యంత కీలకమైనదని, అవినీతిని ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రతిపక్షాన్ని అణచివేయాలని పోలీసులు చూడడం సరికాదని, ప్రశ్నించే గొంతు నొక్కేయాలని ప్రయత్నించకూడదని హితవు పలికారు. పార్టీలకు అతీతంగా పోలీసు వ్యవస్థ పనితీరు ఉండాలని, బాధిత వర్గాలకు అండగా పోలీసు వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ధార్మిక సంస్థలు, ఆలయాలపై దాడులు పెరగడం బాధాకరమని, ఏ మతం విశ్వాసాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని చంద్రబాబు ఉద్ఘాటించారు. భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. అంతర్వేది సహా అన్ని ఆలయాల్లో దాడులపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

More Telugu News