China: భారత్‌పై చైనా త్వరలోనే మరో భారీ అతిక్రమణకు పాల్పడే అవకాశం: అమెరికా విశ్లేషకుడు

  • జిన్‌ పింగ్‌ చర్యలన్నీ బెడిసికొడుతున్నాయి
  • చైనాకు భారత సైన్యం చుక్కలు చూపిస్తోంది
  • జిన్‌ పింగ్ తన పరువు నిలబెట్టుకునే చర్యలకు ప్రయత్నించొచ్చు
  • అయితే, పూర్తిస్థాయి యుద్ధ సామర్థ్యం చైనాకు లేదు
america profesional about china india conflict

భారత్‌తో ఘర్షణపూరిత వాతావరణం సృష్టించేలా చర్యలు తీసుకుంటున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గురించి అంతర్జాతీయ పత్రిక 'న్యూస్‌వీక్‌' ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. ఆయన చైనాలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ, భారత ఆర్మీ వాటన్నింటినీ తిప్పికొడుతోంది. దీంతో జిన్ పింగ్ చేస్తోన్న కుట్రపూరిత చర్యలన్నీ బెడిసికొడుతున్నాయి.

ఈ విషయాలను తెలుపుతూ అమెరికాలోని రాజకీయ రంగ విశ్లేషకుడు గోర్డన్‌ జీ చాంగ్‌. 'ది కమింగ్‌ కొలాప్స్‌ ఆఫ్‌ చైనా' అనే పుస్తకంలో రాసిన పలు విషయాలను 'న్యూస్‌వీక్‌' ప్రచురించింది. భారత్‌పై చైనా కనబర్చుతోన్న వైఖరికి కుట్ర పన్నింది షీ జిన్‌పింగేనని అందులో పేర్కొన్నారు. ఇటీవల తూర్పు లడఖ్‌ సమీపంలోని వాస్తవాధీన రేఖ వెంట జరిగిన అతిక్రమణలు ఘోరంగా విఫలమయ్యాయని చెప్పారు.

జిన్‌పింగ్‌ ఒత్తిడి వల్లే ఆ దేశ ఆర్మీ భారత భూభాగాలలోకి చొచ్చుకొస్తూ ఎన్నో ఎదురుదెబ్బలు తిందని చెప్పారు. భారత ఆర్మీ ఊహించని విధంగా కుట్రలను తిప్పికొడుతుండడంతో జిన్‌పింగ్‌ పరువు దక్కించుకొనేందుకు త్వరలోనే మరో భారీ అతిక్రమణకు పాల్పడే అవకాశం ఉందని చెప్పారు. 1962లో భారత్‌-చైనా మధ్య యుద్ధం జరిగిన తర్వాత భారత్ ఎన్నో‌ రక్షణాత్మక వ్యూహాలను అనుసరిస్తోందని చెప్పారు.

చైనాపై ప్రతిదాడికి భారత్‌ వెనుకాడడం లేదని వివరించారు. కొన్నినెలల క్రితం గల్వాన్‌లో ఈ క్రమంలో భారత్ సైనికులు 20 మంది, చైనా సైనికులు 43 మంది మృతి చెందారని తెలిపారు. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలో భారత్‌ కీలక పర్వత ప్రాంతాల్ని స్వాధీనం చేసుకోవడంతో చైనా కంగు తిన్నదని చెప్పారు.

చివరి సారిగా చైనా 1979లో వియత్నాంతో నేరుగా సైనిక ఘర్షణకు దిగిందని, అయితే, చైనా అనుకున్న మేర విజయం సాధించలేకపోయిందని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత చైనా భారీ స్థాయిలో సైనిక, ఆయుధ ఆధునికీకరణకు ప్రయత్నాలు జరుపుతూనే ఉందని చెప్పారు. ఇప్పటికీ ఇతర దేశాలతో యుద్ధం చేయాలంటే చైనా యుద్ధ సామర్థ్యం తగిన స్థాయిలో లేదని తాజా ఘటనల్ని చూస్తే అర్థమవుతోందని ఆయన చెప్పారు.

More Telugu News