KCR: ఇకపై రెవెన్యూలో అవినీతి ఉండదు.. 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి‌: సీఎం కేసీఆర్‌

  • కొత్త రెవెన్యూ చట్టాన్ని మండలిలో ప్రవేశపెట్టిన కేసీఆర్
  • రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం
  • ఎన్నో సమస్యలకు పరిష్కారం
  • ధరణి పోర్టల్‌లో మార్పులకు తహసీల్దార్లకు అధికారం లేదు
no more corruption in revenue kcr

తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. కొత్త రెవెన్యూ చట్టాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనమండలిలో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో తీసుకొస్తున్న కొత్త రెవెన్యూ చట్టంపై వివరాలు తెలిపారు. తెలంగాణలో రెవెన్యూ సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, వీఆర్వో వ్యవస్థను రద్దు చేశామని చెప్పారు. రెవెన్యూ సంస్కరణల్లో ఇది తొలి అడుగు మాత్రమేనని, ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.

పలు చట్టాల సమాహారంగా ఈ కొత్త రెవెన్యూ చట్టం ఉంటుందని కేసీఆర్ తెలిపారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం ఉండదని తెలిపారు. ధరణి పోర్టల్‌లో మార్పులకు తహసీల్దార్లకు అధికారం లేదని చెప్పారు. దశాబ్దాలుగా జరుగుతున్న తప్పులను ఒక్కరోజులో సరిదిద్దడం సాధ్యం కాదని, సమగ్ర సర్వేనే అన్ని సమస్యలకు పరిష్కారమని తెలిపారు.

రిజిస్ట్రేషన్ ధరను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, రిజిస్ట్రేషన్‌కు మాత్రమే ఎమ్మార్వోకు ధరణి పోర్టల్‌ను ఓపెన్ చేసే అవకాశం ఉందని చెప్పారు. సబ్‌ రిజిస్ట్రార్లకు ఎలాంటి విచక్షణాధికారం లేదని ఆయన తెలిపారు. పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ధరణి పోర్టల్‌లో అప్‌డేట్‌ కాగానే రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌, ఆప్‌డేషన్‌ కాపీలు వస్తాయని ఆయన తెలిపారు.

రెవెన్యూ కోర్టులను రద్దు చేశామని, కావాలని వివాదాలు పెట్టుకునే వారి కోసం ప్రభుత్వం సమయం వృథా చేయదని ఆయన తేల్చిచెప్పారు. బయోమెట్రిక్‌, ఐరిస్‌, ఆధార్‌, ఫొటోతో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపడతామని, ఈ వివరాలన్నీ లేకుండా తహసీల్దార్లకు పోర్టల్‌ కూడా తెరుచుకోదని ఆయన తెలిపారు.

More Telugu News