Undavalli Sridevi: వివాదంలో చిక్కుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి... తీవ్ర ఆరోపణలు చేసిన కార్యకర్త

Financial allegations on YSRCP MLA Undavalli Sridevi
  • ఎమ్మెల్యే శ్రీదేవి తనకు రూ.1.40 కోట్లు ఇవ్వాలన్న మేకల రవి
  • భర్త మోసం చేశాడని శ్రీదేవి తన వద్ద వాపోయారని వెల్లడి
  • ఇతరుల నుంచి డబ్బు తెచ్చి శ్రీదేవికి ఇచ్చానని వివరణ
గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఓ వివాదంలో చిక్కుకున్నారు. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన మేకల రవీంద్ర అనే వైసీపీ కార్యకర్త ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉండవల్లి శ్రీదేవి తనకు రూ.1.40 కోట్లు ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కలకలం రేపుతోంది.

ఎన్నికల సమయంలో ఉండవల్లి శ్రీదేవి తనను డబ్బు కావాలని అడిగితే ఇచ్చానని రవి వెల్లడించారు. తన భర్త మోసం చేశాడని తనతో చెప్పుకుని ఉండవల్లి శ్రీదేవి వాపోయిందని, ఆమె కన్నీరు పెట్టుకోవడంతో చూడలేక తనకు తెలిసిన వాళ్ల వద్ద డబ్బు తీసుకుని ఆమెకు ఇచ్చానని రవి వివరించారు.

ఇచ్చిన డబ్బు మొత్తం తిరిగి ఇవ్వమని అడిగితే ఇప్పటివరకు ఆమె ఇచ్చింది రూ.60 లక్షలు మాత్రమేనని అన్నారు. ఇంకా రూ.80 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, బ్యాలెన్స్ ఇచ్చేది లేదని బెదిరిస్తున్నారని మేకల రవి తెలిపారు. ఈ విషయంలో తనకు సీఎం జగన్ న్యాయం చేయాలని, లేకపోతే రాజధాని ప్రాంతంలో జరిగే మొదటి వైసీపీ కార్యకర్త ఆత్మహత్య తనదే అవుతుందని స్పష్టం చేశారు. రవి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

అయితే, వైసీపీ నేతలు మాత్రం మేకల రవి వాదనలను నమ్మడంలేదు. రూ.1.40 కోట్లు అప్పు ఇచ్చే ఆర్థికస్థాయి రవికి లేదని, రవికి అంతపెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చేవారు కూడా ఎవరూ లేరని అంటున్నారు. పైగా, కోటి రూపాయలకు పైగా సొమ్ము ఇచ్చి ఎలాంటి అగ్రిమెంట్ తీసుకోకపోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని హెచ్చరిస్తున్నారు.

గుంటూరు జిల్లా వైసీపీ నేత శివారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో డబ్బులు ఇచ్చానని చెబుతున్న మేకల రవి ఇన్నాళ్లు తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. రూ.10 వేలు అప్పు తెచ్చుకుంటేనే ఏదో ఒక లిఖితపూర్వక పత్రం ఉంటుందని, అలాంటిది కోటి రూపాయలకు పైగా ఇచ్చాననడం నమ్మశక్యంగా లేదని అన్నారు. కాగా, ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా ఖండించినట్టు తెలుస్తోంది.
Undavalli Sridevi
Mekala Ravi
Loan
Tadikonda
Jagan
YSRCP

More Telugu News