నేడే నీట్.. తెలంగాణలో పరీక్ష రాస్తున్న 55,800 మంది విద్యార్థులు

13-09-2020 Sun 06:45
  • కరోనా నేపథ్యంలో మారిన నియమనిబంధనలు
  • దేశవ్యాప్తంగా 15.97 లక్షల మంది దరఖాస్తు
  • పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
16 lakh students to write NEET today

దేశవ్యాప్తంగా మరికొన్ని గంటల్లో నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రారంభం కానుంది. నీట్‌ను ఈసారి కరోనా కల్లోలం మధ్య నిర్వహిస్తుండడంతో ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి మాస్కు ధరించి, శానిటైజర్ పట్టుకుని కేంద్రానికి రావాల్సి ఉంటుంది. అక్కడ మళ్లీ ఒక్కో విద్యార్థికి మూడు పొరలున్న మాస్కును అధికారులు అందజేస్తారు. పరీక్ష రాసే విద్యార్థులు చేతులకు గ్లౌజులు ధరించొచ్చు. పారదర్శకంగా ఉండే నీళ్ల బాటిల్‌ను కూడా వెంట తెచ్చుకోవచ్చు. హాల్ టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డు తప్పనిసరని అధికారులు తెలిపారు. మొబైల్ ఫోన్లు, పెన్నులు, చేతి గడియారాలు, బంగారు ఆభరణాలు, ఇతర లోహాలతో చేసిన వస్తువులను అనుమతించరు.

హాల్ టికెట్‌లో పేర్కొన్న సమయంలోనే విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలి.  మధ్యాహ్నం 1.30 గంటలకల్లా విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలి. 1.45 గంటలకు ప్రశ్నపత్రం ఇస్తారు. పొడవు చేతుల చొక్కాలు ధరించి వచ్చిన వారిని అనుమతించరు. చెప్పులు మాత్రమే వేసుకోవాలి. మెటల్ డిటెక్టర్లతో అభ్యర్థులను తనిఖీ చేస్తారు. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం హాల్ టికెట్. దీనిపై ఉన్న నిబంధనలు, సూచనలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చదవాలి. వీటిని చదవక పోవడం వల్ల ఇటీవల చాలామంది విద్యార్థులు జేఈఈ మెయిన్, ఎంసెట్ రాయడానికి వచ్చిన అభ్యర్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నీట్‌కు దేశవ్యాప్తంగా 15.97 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 55,800 తెలంగాణ విద్యార్థులు నీట్ రాయబోతున్నారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలలో మొత్తం 112 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 4 గంటల వరకు ఆఫ్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల మధ్య దూరం పాటించే ఉద్దేశంతో పరీక్ష కేంద్రాల సంఖ్యను 2,546 నుంచి 3,843కు పెంచారు. ఒక్కో గదికి 12 మంది విద్యార్థులను మాత్రమే అనుమతిస్తారు.