KCR: గతంలో బాగా పనిచేసే అధికారులను ప్రజలు దేవుళ్లుగా భావించేవాళ్లు: సీఎం కేసీఆర్

  • రెవెన్యూ ఉద్యోగుల ప్రతినిధులతో సీఎం సమావేశం
  • ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచన
  • తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో మార్పు కనిపించాలని ఉద్బోధ
CM KCR held a meeting with revenue department representatives

తెలంగాణ అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం బిల్లుకు ఆమోదం లభించడంతో సీఎం కేసీఆర్ సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలతో హైదరాబాదు ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో గ్రామాలు, మండల స్థాయిలో బాగా పనిచేసే అధికారులను ప్రజలు దేవుళ్లుగా భావించేవారని, మళ్లీ అలాంటి సంస్కృతిని వికసింపచేయాలని పిలుపునిచ్చారు.

అధికారుల ప్రవర్తనను ప్రజలు గమనిస్తుంటారని, రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను సహనంతో పరిష్కరించాలని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ప్రధానంగా తీసుకువచ్చిన రెవెన్యూ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు రెవెన్యూ శాఖలోని అధికారులు, ఇతర సిబ్బంది ఐక్యంగా, నిజాయతీగా పనిచేయాలని ఉద్బోధించారు. ఇకపై తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ సర్కారు ఎప్పుడూ కూడా ప్రజలే కేంద్ర బిందువుగా నిర్ణయాలు తీసుకుంటుందని, ఈ క్రమంలోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. విధి నిర్వహణలో రెవెన్యూ సిబ్బందికి ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వీఆర్వోలకు ఇతర శాఖల్లో చేరేందుకు ఆప్షన్లు ఇస్తామని, వారికి ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేశారు.

More Telugu News