Kodandaram: నాడు ఎన్టీఆర్ సన్యాసం స్వీకరించడానికి స్వామి అగ్నివేశ్ సూచనలే కారణం: కోదండరాం

Kodandaram reveals  Swami Agniveshbehind NTR saffron attire
  • అగ్నివేశ్ మృతికి సంతాపం తెలిపిన కోదండరాం
  • ఎన్టీఆర్ అప్పట్లో అగ్నివేశ్ మాటలు పాటించారని వెల్లడి
  • అగ్నివేశ్ మృతితో ఉద్యమాలకు తీరని లోటని వ్యాఖ్యలు
టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. అగ్నివేశ్ మృతికి సంతాపం ప్రకటించారు. అగ్నివేశ్ ఎంతో ప్రభావవంతమైన వ్యక్తి అని, అగ్నివేశ్ సూచనల కారణంగానే గతంలో ఎన్టీఆర్ అంతటివాడు సైతం సన్యాసం స్వీకరించి కాషాయం ధరించారని కోదండరాం వెల్లడించారు. స్వామి అగ్నివేశ్ మృతి ప్రజాస్వామిక ఉద్యమాలకు తీరని నష్టం అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

80వ దశకంలో ఓ తుపానులా తెలుగు రాజకీయాల్లోకి దూసుకొచ్చిన ఎన్టీఆర్ సీఎం అయ్యారు. అయితే కొంతకాలం పాటు ఎన్టీఆర్ పూర్తి కాషాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అందుకు కారణం స్వామి అగ్నివేశ్ ప్రబోధనలే. జాతీయ స్థాయిలో ప్రముఖ సంఘసేవకుడిగా మన్ననలు అందుకున్న స్వామి అగ్నివేశ్ నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు.

కాషాయ దుస్తుల్లో ఉన్న స్వామి అగ్నివేశ్ ను చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. మీరు సన్యాసం స్వీకరించడానికి గల కారణాలు ఏంటి అని అగ్నివేశ్ ను ప్రశ్నించారు. దాంతో ఆయన బదులిస్తూ, సన్యాసిగా ఉండడం వల్ల ఎలాంటి స్వార్థం దరిచేరేందుకు అవకాశం ఉండదని, అప్పుడే మన కోసం కాకుండా ఇతరుల కోసం పనిచేస్తామని వెల్లడించారు. మీరు కూడా సన్యాసం స్వీకరించండి, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయండి అంటూ స్వామి అగ్నివేశ్ బోధించారు.

ఆ తర్వాత కొన్నిరోజులకే ఎన్టీఆర్ కాషాయం ధరించారు. కొన్నాళ్ల పాటు ఆయన కాషాయ వేషధారణలోనే కొనసాగారు. స్వామి అగ్నివేశ్ ఢిల్లీలో చికిత్స పొందుతూ గతరాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Kodandaram
NTR
Saffron
Swami Agnivesh

More Telugu News