Telangana: సచివాలయంపై ఉన్న శ్రద్ధ కొవిడ్‌పై లేదు: కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కిషన్‌రెడ్డి

  • 1400 వెంటిలేటర్లు ఇస్తే 500 కూడా బయటకు తీయలేదు
  • వలస కార్మికుల కోసం రూ. 224 కోట్లు ఇచ్చాం
  • వాటిలో కేంద్రం రాయితీ ఇస్తున్నట్టు ఎందుకు చెప్పడం లేదు
Union Minister G Kishan Reddy slams Telangana CM KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిన్న ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన మంత్రి కరోనా వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేయద్దని హితవు పలికారు. సచివాలయం కూల్చివేతపై ఉన్న శ్రద్ధలో కొంచెమైనా కొవిడ్‌ నియంత్రణపై పెట్టి ఉంటే రాష్ట్రంలో నేడు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. రాష్ట్రానికి కేంద్రం 1400 వెంటిలేటర్లు కేటాయిస్తే కనీసం 500 వెంటిలేటర్లను కూడా ఉపయోగంలోకి తీసుకురాలేదని ధ్వజమెత్తారు.

కరోనా సమయంలో రాష్ట్రానికి 13.85 లక్షల ఎన్‌95 మాస్కులు, 2.99 లక్షల పీపీఈ కిట్లు, 3.12 లక్షల పీసీఆర్ కిట్లు, 42 లక్షల హెచ్‌సీక్యూ మాత్రలు ఇచ్చినప్పటికీ ఇంకా కేంద్రం ఆదుకోవడం లేదని చెప్పడం సరికాదన్నారు. జన్‌ధన్ ఖాతాల్లో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మొత్తం రూ. 778 కోట్లు వేశామని, పీఎఫ్, ఈపీఎఫ్ కింద కార్మికుల ఖాతాల్లో 770 కోట్లు వేశామని పేర్కొన్నారు. రైతులకు పీఎం కిసాన్ యోజన కింద ఇచ్చే నిధులకు అదనంగా రూ. 666 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. అలాగే, వలస కార్మికుల కోసం రాష్ట్రానికి రూ. 224 కోట్లు ఇచ్చినట్టు వివరించారు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలంగాణకు ఎన్ని రహదారులు వచ్చాయో, గత నాలుగేళ్లలో అన్ని మంజూరు చేసినట్టు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ కిట్లలో ఒక్కో కిట్‌కు రూ. 6వేలను, రేషన్ బియ్యంలో కిలోకు రూ. 30 రాయితీని కేంద్రం భరిస్తున్నప్పటికీ ఆ విషయాన్ని కేసీఆర్ ఎక్కడా ప్రస్తావించడం లేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభంతోపాటు, సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల మాత్రమే రుణాలు తీసుకోవాలని చెప్పాం తప్పితే జీఎస్టీ కింద రాష్ట్రానికి నిధులు ఇవ్వబోమని తాము చెప్పలేదన్నారు.

More Telugu News