KIMS: దేశంలో ఇదే ప్రథమం... హైదరాబాద్ కిమ్స్ లో కరోనా రోగికి రెండు ఊపిరితిత్తులు మార్పిడి చేసిన వైద్యులు

  • ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్న కరోనా
  • ప్రమాదకర వ్యాధి బారిన పడిన పంజాబ్ యువకుడు
  • ఆపరేషన్ ముంగిట కరోనా పాజిటివ్
  • ఎంతో క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించిన కిమ్స్ వైద్యులు
Hyderabad KIMS doctors transplanted two lungs in a corona infected patient

కరోనా మహమ్మారి సోకితే ఊపిరితిత్తులపై వాటి ప్రభావం కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రాణాంతకమని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండడం తెలిసిందే. కరోనా నయమైన తర్వాత కూడా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉండడం గుర్తించారు. కరోనా తగ్గిన తర్వాత ఊపిరితిత్తులు, గుండె, కాలేయం వంటి కీలక అవయవాలపై వైరస్ ప్రభావం చాలాకాలం ఉంటుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు.

కరోనా సోకిన రిజ్వాన్ (32) అనే యువకుడికి రెండు ఊపిరితిత్తులు మార్పిడి చేశారు. ఈ శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆ వ్యక్తిని నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. దేశంలోనే ఊపిరితిత్తులు, గుండె మార్పిడి శస్త్రచికిత్సల్లో నిపుణుడిగా పేరుగాంచిన డాక్టర్ సందీప్ అత్తావార్ నేతృత్వంలో కిమ్స్ వైద్యుల బృందం ఈ సర్జరీని నిర్వహించింది. పంజాబ్ కు చెందిన రిజ్వాన్ సర్కోయిడోసిస్ సమస్యతో బాధపడుతున్నాడు. సర్కోయిడోసిస్ కారణంగా అతని రెండు ఊపిరితిత్తులు ఫైబ్రోసిస్ కు గురయ్యాయి. అతడి పరిస్థితి కొన్నిరోజుల్లోనే క్షీణించింది.

రిజ్వాన్ ఆరోగ్యవంతుడవ్వాలంటే అతడి రెండు ఊపిరితిత్తులను మార్పిడి చేయడమొక్కటే మార్గమని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అతడికి కరోనా సోకింది. దాంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. కిమ్స్ వైద్యులు ఎంతో శ్రమించి ఆ కష్టమైన కార్యాన్ని జయప్రదం చేశారు. కోల్ కతాలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన రెండు ఊపిరితిత్తులు రిజ్వాన్ శరీరతత్వానికి సరిపడేట్టు ఉండడంతో డాక్టర్ సందీప్ అత్తావార్ బృందం ఎంతో శ్రమించి సర్జరీ పూర్తిచేసింది. దేశంలోనే ఈ తరహా ఆపరేషన్ మొట్టమొదటిదని కిమ్స్ వర్గాలు తెలిపాయి.

More Telugu News