Priests: కర్ణాటక అరకేశ్వరాలయంలో దారుణం... ముగ్గురు అర్చకులను బండరాళ్లతో మోది చంపేసిన దుండగులు

  • హుండీలు పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
  • నిద్రిస్తున్న అర్చకులపై కిరాతకంగా దాడి
  • రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సీఎం
Robbers murdered three priests of Arakeshwara Temple in Karnataka

కర్ణాటకలోని మాండ్య నగర శివారు ప్రాంతంలో  ఘోరం జరిగింది. స్థానికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన అరకేశ్వర ఆలయంలో దోపిడీకి వచ్చిన దొంగలు ముగ్గురు అర్చకులను అత్యంత దారుణంగా చంపేశారు. మాండ్య నగరం సమీపంలోని గుట్టలు ప్రాంతంలో అరకేశ్వర ఆలయం ఉంది. అయితే, ఈ ఉదయం ఆలయంలో ముగ్గురు అర్చకులు రక్తపు మడుగులో విగతజీవులై పడివుండడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. పైగా ఆలయ హుండీలు పగులగొట్టిన స్థితిలో కనిపించడంతో ఇది దోపిడీ దొంగల పనే అయ్యుంటుందని భావిస్తున్నారు.

హత్యకు గురైన అర్చకులను గణేశ్, ప్రకాశ్, ఆనంద్ లుగా గుర్తించారు. వారి తలలను బండరాళ్లతో చితక్కొట్టి ఉండడం అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది. దొంగలు హుండీల్లోని కరెన్సీ నోట్లను తీసుకుని చిల్లర అక్కడే వదిలివేశారు. కాగా, దొంగల దాడిలో మరణించిన ఆ ముగ్గురు అర్చకులు పరస్పరం బంధువులే. ఆలయ భద్రత కోసం వారు ముగ్గురూ అక్కడే నిద్రిస్తుంటారు. వారు నిద్రలో ఉండగానే దొంగలు ఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనతో వారి బంధువర్గంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

కాగా, హుండీలను దోచుకున్న దొంగలు గర్భగుడి తలుపులు కూడా బద్దలు కొట్టి లోపల ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయేమోనని వెదికినట్టు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. దీనిపై మాండ్య జిల్లా ఎస్పీ పరశురామ్ మాట్లాడుతూ, ఈ ఘటనకు కారకులైన వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ ఘటనపై కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

More Telugu News