Galla Jayadev: డాక్టర్ సోమ్లా నాయక్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా: గల్లా జయదేవ్

  • నరసరావుపేట కొవిడ్ సమీక్షలో రభస
  • కలెక్టర్, డాక్టర్ మధ్య వాగ్యుద్ధం
  • డాక్టర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు!
Galla Jaydev says he condemns Dr Somla Naik arrest

గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగిన కొవిడ్ సమీక్షలో నిర్భయంగా సమస్యల గురించి ప్రస్తావించిన డాక్టర్ సోమ్లా నాయక్ ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఆపై ఆ డాక్టర్ ను పోలీసులు విడిచిపెట్టారు. దీనిపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. డాక్టర్ సోమ్లా నాయక్ అరెస్ట్ ను ఖండిస్తున్నానని తెలిపారు. కరోనాను నియంత్రించడంలో విఫలమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం తమ వైఫల్యాలకు డాక్టర్లను నిందిస్తుండడం పట్ల డాక్టర్ సోమ్లా నాయక్ ప్రశ్నించాడని, ప్రశ్నించిన ఆ డాక్టర్ ను అరెస్ట్ చేయడం సరైన చర్య కాదని గల్లా జయదేవ్ పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలను సురక్షితంగా ఉంచడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని, ఈ నేపథ్యంలో వైఫల్యాలకు బాధ్యత తీసుకోవడానికి బదులుగా ప్రభుత్వం ఇదేమిటని ప్రశ్నిస్తున్న వారిని అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని గల్లా జయదేవ్ ఆరోపించారు.

కాగా, నిన్న నరసరావుపేటలో జరిగిన సమీక్షలో నాదెండ్ల పీహెచ్ సీ వైద్యుడు సోమ్లా నాయక్ కరోనా సమస్యలపై గళమెత్తారు. ఆసుపత్రుల్లో పడకలు ఖాళీగా ఉన్నాయన్నది అవాస్తవం అని, పడకలు ఖాళీగా లేవని స్పష్టం చేశారు. దాంతో కలెక్టర్ శామ్యూల్ అసహనంతో, సరైన రీతిలో మాట్లాడాలంటూ సూచించారు. దానికి డాక్టర్ సోమ్లా నాయక్ బదులిస్తూ, తాను చెబుతున్నది వాస్తవమేనని పునరుద్ఘాటించారు.

ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఉద్యోగం చేతకాకపోతే వదిలేయాలని కలెక్టర్ అన్నారు. అంతేకాదు, ఆ డాక్టర్ ను సస్పెండ్ చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరెవరు నన్ను సస్పెండ్ చేయడానికి అంటూ డాక్టర్ సోమ్లా నాయక్ కూడా అదేస్థాయిలో బదులివ్వడంతో సమీక్ష సమావేశం రసాభాస అయింది. 'నన్ను హూ ఆర్ యూ అంటావా?' అంటూ జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆవేశానికి లోనయ్యారు. 'ఈ ప్రాంత ఎస్సై ఎవరు? వెంటనే ఇతడ్ని అరెస్ట్ చేయండి!' అంటూ ఆదేశించారు.  

More Telugu News