India: పాంగాంగ్ సమీపంలోని ఫింగర్-4 శిఖరాలను స్వాధీనం చేసుకున్న భారత సైన్యం!

  • గతంలో శిఖరాలపై పాగా వేసిన చైనా జవాన్లు
  • వారు వెనుదిరగగానే ఆక్రమించిన భారత సైన్యం
  • పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందన్న సీనియర్ అధికారి
Indian Jawans Occupied Crucial Points near Finger 4

చైనా సరిహద్దుల్లో అత్యంత కీలకమైన పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ఉన్న ఫింగర్-4 శిఖరాలను భారత జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదే సమయంలో సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈ ప్రాంతంలో గురువారం నాడు ఎటువంటి ఘర్షణలూ జరుగకపోయినా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనివుంది. చైనా దాదాపు 50 వేల మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సభ్యులను తూర్పు లడఖ్ ప్రాంతానికి తరలించగా, భారత్ సైతం తన దళాలను పెంచుకుంటూ పోతోంది.

ఇక ఈ ప్రాంతంలోని ఎత్తయిన ప్రాంతాలపై పట్టును సాధించేందుకు ఇరు దేశాల జవాన్లూ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పాంగాంగ్ సరస్సు దక్షిణాన ఉన్న ఫింగర్-4 పరిధిలో గతంలో తాము ఆక్రమించిన శిఖర ప్రాంతాలను ఖాళీ చేసిన చైనా, అక్కడి దళాలను ఉత్తర ప్రాంతానికి తరలించింది. ఆ వెంటనే అప్రమత్తమైన భారత జవాన్లు, తిరిగి చైనా సైన్యం అక్కడికి చేరకుండా, వాటిని ఆక్రమించేశాయి. ప్రస్తుతం ఫింగర్-4 శిఖరాలు భారత అధీనంలో ఉన్నాయని ఉన్నతాధికారులు తెలిపారు.

ఇక, మరో కీలకప్రాంతమైన రెజాంగ్ లా వద్దకు రెండు రోజుల క్రితం బరిసెలు, కత్తులు తదితర ఆయుధాలతో వచ్చిన చైనా జవాన్లు ఇంకా ఆ ప్రాంతాన్ని వీడలేదని తెలుస్తోంది. వారిని వెనక్కు పంపేందుకు భారత దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదే విషయమై కమాండర్ల స్థాయిలో జరిగిన చర్చలు కూడా ఎటువంటి ఏకాభిప్రాయం లేకుండానే ముగిశాయి.

ఇదిలావుండగా, చైనా నుంచి కవ్వింపులు అధికంగా వస్తున్నాయని, కొత్త స్థావరాలను అభివృద్ధి చేస్తూ, కొత్త రక్షణ వ్యవస్థలను చైనా రంగంలోకి దింపుతోందని రక్షణ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇవి భారత జవాన్లకు దగ్గరగా వచ్చి పోతున్నాయని, ఇండియాను బెదిరించడమే చైనా లక్ష్యంగా తెలుస్తోందని, మన దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని ఆయన అన్నారు.

More Telugu News