Rhea Chakravarthi: దాదాపు 25 మంది సెలబ్రిటీల పేర్లు చెప్పేసిన రియా, షోవిక్... అందరి చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు!

Rhea Told 25 Bollywood Celebrities Names in Drugs Scam
  • పోలీసుల విచారణలో పేర్లు చెప్పిన నిందితులు
  • రెండు వారాల్లో అందరికీ నోటీసులు
  • ప్రత్యేక కథనాలు ప్రచురించిన మీడియా
బాలీవుడ్ డ్రగ్స్ స్కామ్ లో సుశాంత్ ప్రేయసి రియా, షోవిక్ చక్రవర్తిలను విచారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు, ఈ వ్యవహారంతో సంబంధం వున్న పలువురు టాప్ సెలబ్రిటీల పేర్లను వారి నుంచి రాబట్టినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ప్రమేయమున్న సుమారు 25 మంది సెలబ్రిటీల పేర్లను రియా, షోవిక్ లు వెల్లడించగా, వారందరికీ వచ్చే రెండు వారాల వ్యవధిలో సమన్లు జారీ చేసి విచారించాలని ఎన్సీబీ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇటీవలి బాలీవుడ్ పార్టీలు, అందులో పాల్గొని డ్రగ్స్ తీసుకున్న వారిలో తనకు తెలిసిన పేర్లను రియా విచారణలో చెప్పిందని, మాదకద్రవ్యాలు, మత్తు మందులను సినీ తారలకు అందిస్తున్న వారి జాబితాను కూడా పేర్కొందని టీవీ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి. రియా వెల్లడించిన సెలబ్రిటీల జాబితా తమకు అందిందని, వచ్చే పది రోజుల్లో వారికి నోటీసులు జారీ కానున్నాయని 'టైమ్స్ నౌ' సైతం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

కాగా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు ఎలా డ్రగ్స్ సరఫరా అయ్యేవి? 'కేదార్ నాథ్ ' చిత్రం షూటింగ్ సమయంలో ఎవరి ద్వారా డ్రగ్స్ తీసుకున్నాడు? తాను ఎవరి ద్వారా డ్రగ్స్ తెప్పించి సుశాంత్ కు ఇచ్చింది? తదితర విషయాలను అధికారుల విచారణలో రియా స్పష్టంగా చెప్పినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని తమ రిపోర్టులో ప్రస్తావించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేష్ జోషి ముందు నివేదికను ఉంచగా, రియా బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

"2016-17లో 'కేదార్ నాథ్' సినిమా షూటింగ్ సమయంలో రియా ద్వారా సుశాంత్ మాదకద్రవ్యాలను తెప్పించుకున్నాడు. అతనికి రియాతో పరిచయం కాకముందే డ్రగ్స్ అలవాటు ఉంది. వైద్యులు వద్దని చెప్పినా అతను వాటిని వినియోగిస్తూనే ఉన్నాడు. వాటిని రియా ద్వారా తెప్పించుకున్నాడనడానికి సాక్ష్యాలున్నాయి. ఈ విషయంలో షోవిక్, శామ్యూల్ మిరిందాలను కూడా విచారించాం. వారి నుంచి కూడా కీలక ఆధారాలు లభించాయి. ఈ సమయంలో నిందితులకు బెయిల్ ఇస్తే, సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి" అని ఎన్సీబీ తరఫు న్యాయవాది వాదించగా, న్యాయమూర్తి బెయిల్ ను నిరాకరిస్తున్నట్టు తెలిపారు.
Rhea Chakravarthi
Showik
NCB
Drugs
Maharashtra

More Telugu News